బ్యారేజ్ కుంగిందని హరీశే ఒప్పుకున్నరు : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

బ్యారేజ్ కుంగిందని హరీశే ఒప్పుకున్నరు :  యెన్నం శ్రీనివాస్ రెడ్డి

 హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజ్ ఒకటే కుంగిదని మాజీ మంత్రి హరీశ్ రావు తప్పు ఒప్పుకుంటున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దేవుడి పేరుతో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. కేసీఆర్ లీడర్ గా రీ లాంచ్ చేసుకోవడానికే నల్గొండ సభ పెట్టారని ఎద్దేవా చేశారు.

సీబీఐ విచారణకు ఆదేశించండి: పాయల్ శంకర్ 

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చెప్పలేకపోతున్నదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. లోక్ సభ ఎన్నికల కోసమే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కొత్త నాటకాలకు తెర లేపాయని విమర్శించారు. కాంగ్రెస్​కు దమ్ముంటే సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడారు. ‘‘మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన విషయం తెలుసుకుని గతేడాది అక్టోబర్ 22న మా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పరిశీలించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి కంప్లైంట్ చేశారు. వారు అడిగిన ప్రశ్నలకు అప్పటి ప్రభుత్వం సమాధానాలు చెప్పలేదు. మేడిగడ్డ చూసి రావడం వల్ల ఒరిగేది ఏమీ లేదు’’అని విమర్శించారు. 

పిక్నిక్​కు వెళ్లినట్టు: పాల్వాయి హరీశ్ 

మేడిగడ్డ బ్యారేజ్ చూసేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలను చూస్తే... పిక్నిక్ వెళ్లినట్టు అనిపించిందని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం ఫెయిల్యూర్ అన్న మాట అందరికీ తెలిసిందే అని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో హరీష్ మాట్లాడారు. ప్రాజెక్ట్ అవినీతిపై కాంగ్రెస్ పార్టీ సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు. వెంటనే లేఖ రాయాలని డిమాండ్ చేశారు. సీబీఐ ఎంక్వైరీతోనే వాస్తవాలు బయటికి వస్తాయని తెలిపారు.