- ఏపీకి కట్టబెట్టిన పాపంలో ఆయన పాత్ర ఉందని ఫైర్
- తెలంగాణకు తీరని ద్రోహం చేశారంటూ మండిపాటు
హైదరాబాద్, వెలుగు: ఏపీకి అప్పగించిన ఏడు మండలాల అంశంపై రాజ్యసభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు గురువారం ఓ ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. విభజన చట్టంలోనే ఆ మండలాలను ఏపీకి ఇవ్వాలని ఉందన్న వ్యాఖ్యలు పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్నాయన్నారు. చరిత్రను వక్రీకరిస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.
విభజన చట్టానికి సవరణ తీసుకొచ్చి, ఆర్డినెన్స్ ద్వారా ఏడు మండలాలను ఏపీకి కట్టబెట్టింది బీజేపీ ప్రభుత్వమేనని, ఇందులో కిషన్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. పార్లమెంట్ సాక్షిగా తప్పుడు వ్యాఖ్యలు చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలనే కిషన్ రెడ్డి కూడా రాజ్యసభలో పునరావృతం చేయడం కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్న చీకటి పొత్తుకు నిదర్శనమన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద బహుళ దశల ఎత్తిపోతల ప్రాజెక్టుగా కాళేశ్వరం నిర్మాణం జరగలేదా? అని ప్రశ్నించారు. మండుటెండల్లో కూడా కాల్వల ద్వారా నీళ్లు రైతుల పొలాలకు చేరుతున్నాయని చెప్పారు. ఆ నీళ్లు చూపించేందుకు తాను సిద్ధమని, రావడానికి కిషన్ రెడ్డికి ధైర్యం ఉందా? అని సవాల్ విసిరారు. క్యాబినెట్ మంత్రిగా ఉండి ప్రభుత్వ పనులు ప్రజాధనంతోనే జరుగుతాయని మర్చిపోయి, కేసీఆర్ వ్యక్తిగతంగా డబ్బు ఖర్చు పెట్టారా అని అడగడం అవివేకమని విమర్శించారు. ఇవాళ మాట్లాడింది కిషన్ రెడ్డి అయినా, మాటల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారనే విషయం స్పష్టమైందని ఆరోపించారు.
