ప్రభుత్వంపై హరీశ్ ​ఆరోపణలు సిగ్గుచేటు : చామల కిరణ్ కుమార్ రెడ్డి

ప్రభుత్వంపై హరీశ్ ​ఆరోపణలు సిగ్గుచేటు : చామల కిరణ్ కుమార్ రెడ్డి
  •      ఎంపీ ఎన్నికల్లో లబ్ధి కోసం తప్పుడు ప్రచారం 

హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ ​ప్రభుత్వ వంద రోజుల పాలనపై మాజీ మంత్రి హరీశ్​రావు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని భువనగిరి పార్లమెంట్​కాంగ్రెస్ ​అభ్యర్థి చామల కిరణ్​కుమార్​రెడ్డి అన్నారు. ఎంపీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే లీకులు, ఫేకులతో కాంగ్రెస్​ప్రభుత్వం పాలన సాగిస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భువనగిరిలో జరిగిన సమావేశంలో బుధవారం చామల కిరణ్​ మాట్లాడారు.

 హరీశ్​రావు వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినందుకే బీఆర్ఎస్​ను ప్రజలు బొంద పెట్టారని అన్నారు. వారు చిన్న చిన్న కాలువలను పూర్తి చేసినా రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేదని, కాలువలు పూర్తిచేస్తే కమీషన్లు రావనే.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి గుదిబండగా మార్చారన్నారు. కమీషన్లు దండుకోవడానికే హరీశ్​తన మామకు కుడి భుజంగా పనిచేశారని ఆరోపించారు.

 ఇప్పుడు భువనగిరికి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని మహిళలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడానికి సీఎం రేవంత్, మంత్రులు 24 గంటలు పనిచేస్తున్నారని, ప్రజలు కూడా దీనిని గమనిస్తున్నారన్నారు. లోక్​సభ​ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు ఒక్క సీటు కూడా రాదన్నారు.