- కాంగ్రెస్, బీజేపీ జెండాలు, అజెండాలు పక్కనబెట్టాయి: హరీశ్ రావు
- బీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టడానికి ఆ పార్టీలు పదవులను పంచుకున్నయ్
- రాబోయే రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తరని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అధికారం కోసం జెండాలు అజెండాలను పక్కనబెట్టి ఎంతలా దిగజారవచ్చో కాంగ్రెస్, బీజేపీ నిరూపించాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మార్పు అంటే బీజేపీతో జతకట్టడమేనా? ఇదేనా మీరు తెస్తానన్న మార్పు అని ప్రశ్నించారు. గత 12 ఏండ్లుగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి బీ -టీమ్ అని కాంగ్రెస్, కాంగ్రెస్‌కి బీ టీమ్ అని బీజేపీ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలన్న విషయం చైర్మన్ల ఎంపికలో రుజువైందన్నారు. ఆ రెండు పార్టీలు తెలంగాణ వ్యతిరేక టీమ్ అని నిరూపించాయని సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు.
బీజేపీతో కలిసి సింగిల్ టీమ్‌గా మారిపోయిందని, ఈ అపవిత్ర కలయిక, ఈ అనైతిక పొత్తు ప్రజలు గుర్తించారన్నారు. “రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న ఫెవికాల్ బంధం మున్సిపల్ ఫలితాలతో మరోసారి స్పష్టమైంది. బీఆర్ఎస్‌ను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు సిద్ధాంతాలను గాలికొదిలేశాయి. ఢిల్లీలో కొట్టుకున్నట్టు.. గల్లీలో మాత్రం చేతులు కలుపుతూ వాటాలు వేసుకొని పదవులు పంచుకుంటున్నారు.
దీనికి అలియాబాద్, ఆమన్‌గల్, మెదక్, నర్సాపూర్ ఫలితాలే ప్రత్యక్ష సాక్ష్యం. రేవంత్ రెడ్డి.. మీరు నడిపేది కాంగ్రెస్ సర్కారా? బీజేపీ సర్కారా? బీజేపీ టీడీపీతో కూడిన సంకీర్ణ సర్కారా? ఆలియాబాద్ నుంచి ఆమన్‌గల్ దాకా.. మెట్‌పల్లి నుంచి మెదక్ దాకా మీరు సాగిస్తున్న ఈ చీకటి ఒప్పందాలను ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒంటరిగా బీఆర్ఎస్‌ను ఎదుర్కొనే సత్తా లేదు. అందుకే సిగ్గు వదిలేసి బీజేపీతో కుమ్మక్కై, అధికారాన్ని ఫలితాలను తారుమారు చేస్తూ మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నాయి”అని ఆరోపించారు.
మిమ్మల్ని అస్యహించుకుంటున్నరు..
రాహుల్ గాంధీ ఏమో దేశమంతా బీజేపీపై పోరాటం చేస్తుంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో బీజేపీతో జత కడుతున్నాడని హరీశ్‌రావు విమర్శించారు. మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నికకు బీజేపీ.. కాంగ్రెస్‌తో కలిసింది మీకు తెలియదా? తెలిసే చేశారా.. అని కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దలు కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటారు.. ఇక్కడ మీరేమో కాంగ్రెస్ యుక్త్ బీజేపీ అని నిరూపిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అత్యధిక వార్డులు గెలుచుకున్న చోట్ల కూడా కుట్రలు చేసి పదవులు దక్కించుకున్నారని ఆరోపించారు.
నర్సాపూర్ మున్సిపాలిటీలో చైర్మన్ పదవి కాంగ్రెస్ తీసుకుని, వైస్ చైర్మన్ పదవి బీజేపీకి ఇచ్చారంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం మరొకటి ఉంటుందా అని హరీశ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్‌ను ఆ దెబ్బకొట్టడానికి ఆ రెండు పార్టీలు తమ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చాయన్నారు. కాంగ్రెస్ ముసుగులో బీజేపీ, బీజేపీ ముసుగులో కాంగ్రెస్ పనిచేస్తున్నాయని, ఈ అపవిత్ర కలయికను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటున్నదని విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్తారన్నారు.
