- వాటితో పాటు రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న అప్పులు, కాంగ్రెస్ తెచ్చిన అప్పులనూ మా అప్పుల్లో కలిపేశారు
- మేం తెచ్చిన అప్పులు రూ.4.17 లక్షల కోట్లే
- కాంగ్రెస్ ఇప్పటివరకు రూ.4.50 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: అప్పుల విషయంలో ప్రభుత్వం మళ్లీ అవే కట్టుకథలు చెప్తున్నదని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.8,21,651 కోట్లు అన్నది పచ్చి అబద్ధమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. సీఎం భట్టి విక్రమార్క అప్పుల విషయంలో మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారన్నారు. శనివారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. 2014 జూన్ 2 నాటికే రాష్ట్రంపై ఉన్న ఎఫ్ఆర్బీఎం రుణాలు, గ్యారంటీ రుణాలు రూ.84,268 కోట్లను బీఆర్ఎస్ ప్రభుత్వ ఖాతాలోనే చూపారన్నారు. 2023 డిసెంబర్ 7 నుంచి 2024 మార్చి 31 నాటకి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తీసుకున్న ఎఫ్ఆర్బీఎం రుణాలు రూ.15,118 కోట్లనూ బీఆర్ఎస్ ఖాతాలో జమ కట్టారని, మొత్తంగా బీఆర్ఎస్ చేయని రూ.99,386 కోట్ల అప్పునూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ ఖాతాలో వేశారని విమర్శించారు.
ఆ మొత్తాన్ని 2023 డిసెంబర్ 1 నాటికి బీఆర్ఎస్ప్రభుత్వం తెచ్చిన అప్పుల నుంచి తీసేస్తే తాము తెచ్చిన మొత్తం అప్పు రూ.4,17,495 కోట్లేనని తెలిపారు. ప్రభుత్వం గ్యారంటీగా ఉండి కార్పొరేషన్లు చెల్లించేవి, ప్రభుత్వం గ్యారంటీ లేకుండా కార్పొరేషన్లే చెల్లించేవి కూడా ప్రభుత్వ అప్పుల్లో కలిపేశారని మండిపడ్డారు. కార్పొరేషన్ల అప్పులకు ప్రభుత్వంతో ఏమి సంబంధమని ప్రశ్నించారు. ఆ రుణాలను కార్పొరేషన్లే చెల్లిస్తాయన్నారు. అప్పుల విషయంలో మంత్రి జూపల్లి సవాళ్లు చేసి తోక ముడిచిన తీరును తెలంగాణ మొత్తం చూసిందని, ఆ అవమానం నుంచి బయటపడాలనే అప్పులపై భట్టి తప్పుడు లెక్కలు వండి వార్చారని విమర్శించారు.
తెచ్చిన అప్పుల్లో కాళేశ్వరానికీ పెట్టినం
మిషన్ భగీరథ, కాళేశ్వరం, సీతారామ, స్కీమ్‌లకు సంబంధించి.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాలా రూ.4,10,819 కోట్లు అని కాగ్ స్పష్టం చేసిందని హరీశ్ రావు అన్నారు. 2023 డిసెంబర్లో ప్రభుత్వం ఇచ్చిన వైట్‌పేపర్ ప్రకారం బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పు రూ.4.17 లక్షల కోట్లు తెలిపారు. దీని మీద ఎక్కడ, ఎప్పుడు చర్చకైనా సిద్ధమని తేల్చి చెప్పారు. అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.6,71,757 కోట్లు అని చెప్పారని, అందులోనూ తమకు సంబంధం లేనివి కలిపారని విమర్శించారు. మొన్న మంత్రి జూపల్లి కృష్ణా రావు ముందు రూ.8 లక్షల కోట్లు అన్నారని, ఆ తెల్లారే మళ్లీ రూ.7 లక్షల కోట్లు అని చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1.77 లక్షల కోట్లేనని చెప్పారన్నారు.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం సహా చేసిన అన్ని రకాల అప్పులు రూ.రూ.3,47,294 కోట్లు అని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది మార్చి 18న అసెంబ్లీలో ప్రకటించారని గుర్తు చేశారు. మరి, నాలుగు నెలల్లో అప్పు ఎలా తగ్గిందో రేవంత్, భట్టి చెప్పాలని డిమాండ్ చేశారు. జూన్ 30 నాటికి పబ్లిక్ డొమైన్లో ఉన్న లెక్కల ప్రకారం, 31 నెలల్లో రేవంత్ రెడ్డి చేసిన మొత్తం అప్పు రూ.4.50 లక్షల కోట్లు అని చెప్పారు. కాగా, 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైన ఘటనపై సింగరేణి విజిలెన్స్ విచారణ చేస్తుందని భట్టి చెప్పారని.. కానీ, దొంగకే తనకు తానుగా విచారణ చేసుకోమని చెప్పినట్టుగా ఉందని హరీశ్‌రావు విమర్శించారు.
