
- మిగతా డిమాండ్లనూ పరిష్కరిస్తామని హామీ
- అంగన్‌వాడీలతో మంత్రుల చర్చలు
- సమ్మె కొనసాగిస్తామన్న అంగన్‌వాడీలు
- మంత్రి హరీశ్ స్పష్టమైన హామీ ఇవ్వలేదన్న లీడర్లు
హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వ ఉద్యోగుల జీతాల సవరణకు త్వరలో వేయనున్న పీఆర్సీ(పే రివిజన్ కమిషన్)లో అంగన్‌వాడీలను కూడా చేర్చుతామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. దీనిపై సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పీఆర్సీ సూచన మేరకు అంగన్‌వాడీలకు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. ఆదివారం అంగన్‌వాడీలతో మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. పీఆర్సీలో అంగన్‌వాడీ టీచర్లను చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇతర డిమాండ్లపైనా త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఆ డిమాండ్లపై నివేదిక ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ భారతి హోలికేరిని ఆదేశించారు. అంగన్ వాడీ సెంటర్లకు మధ్యాహ్న భోజన పథకం కింద పెండింగ్ లో ఉన్న బిల్లులను కూడా ప్రభుత్వం విడుదల చేసిందని, ఒకట్రెండు రోజుల్లో ఖాతాల్లో డబ్బులు జమవుతాయని వెల్లడించారు. సీఎం నిర్ణయంతో రాష్ట్రంలోని 70 వేల మంది అంగన్ వాడీ ఉద్యోగులకు లాభం చేకూరుతుందని పేర్కొన్నారు.
అంగన్ వాడీల అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని, త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాగా, మంత్రి హామీలపై అంగన్‌వాడీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయని ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అయితే మంత్రి తమకు నిర్దిష్టమైన హామీలేవీ ఇవ్వలేదని అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ జేఏసీ ప్రకటించింది.