రైతు బీమా తరహాలో .. కార్మిక బీమా : మంత్రి హరీశ్

రైతు బీమా తరహాలో .. కార్మిక బీమా : మంత్రి హరీశ్
  • రైతు బీమా తరహాలో .. కార్మిక బీమా
  • డిజిటల్ కార్డులు పంపిణీ చేస్తం: మంత్రి హరీశ్
  • త్వరలోనే స్పెషల్ డ్రైవ్ చేపడుతాం
  • క్యాంపు కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కౌంటర్ ఏర్పాటు చేయిస్తం
  • కార్మిక భవన్ కోసం సిద్దిపేటలో ఎకరం స్థలం కేటాయిస్తున్నట్లు ప్రకటన

సిద్దిపేట, వెలుగు: రైతు బీమా తరహాలో కార్మిక బీమా ప్రారంభించాలని నిర్ణయించామని మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు ప్రకటించారు. డిజిటల్ కార్డుల రూపకల్పనకు స్పెషల్ డ్రైవ్ చేపడుతామని వెల్లడించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండా భూదేవి గార్డెన్‌‌‌‌‌‌‌‌లో రాష్ట్ర స్థాయి భవన నిర్మాణ కార్మికుల సభకు ముఖ్య అతిథిగా హరీశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నా శక్తినంతా ఉపయోగించి కార్మికుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్త. మీకు తోడుగా ఉంట. మీ ఆశీర్వాదాలు కావాలి” అని అన్నారు. ప్రతి కార్మికుడు కార్డు కలిగి ఉండాలని, కార్డుకు అవసరమైన డబ్బులు తానే చెల్లిస్తానని ప్రకటించారు. కార్మికులకు కార్డు ఉంటే ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే అవకాశం ఉందని, ఇందుకోసం తన క్యాంపు కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కౌంటర్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల సమగ్ర సమాచారంతో డిజిటల్ కార్డులను పంపిణీ చేస్తామని, రెన్యువల్స్‌‌‌‌‌‌‌‌ను పదేండ్లకు పెంచుతామని ప్రకటించారు.

బీసీ బంధును సద్వినియోగం చేసుకోవాలి

స్వయం ఉపాధి పొందేలా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన లక్ష రూపాయల బీసీ బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని హరీశ్ రావు కోరారు. వయోలా గార్డెన్‌‌‌‌‌‌‌‌లో కులవృత్తులకు ప్రోత్సాహం కోసం రూ.లక్ష గ్రాంట్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. అన్ని కులాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. అన్ని కులాల్లో అర్హులైన వారందరికీ దశల వారీగా పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు. సిద్దిపేట మున్సిపాల్టీ ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని హరీశ్‌‌‌‌‌‌‌‌ జెండా ఊపి ప్రారంభించారు. చెట్ల పెంపకం ద్వారా 7.4 శాతం గ్రీన్ కవర్ పెంపొందించిన ఘనత రాష్ట్రానికే దక్కుతుందన్నారు. మొక్కలు పంచడమే కాదు.. నాటి పెంచేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. కోమటి చెరువు కాల్వను పరిశీలించి చౌబీస్ ఖానా పూల్ వద్ద చెత్త తొలగింపు పనులను పరిశీలించారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని 81 మందికి సాయం కింద రూ.21.31 లక్షల చెక్కులను అందజేశారు.

ఆరోగ్య బీమాను ఆగస్టులో ప్రారంభిస్తం

భవన నిర్మాణ కార్మికుల బీమాను లక్షన్నర నుంచి మూడు లక్షలకు పెంచడానికి సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చర్చిస్తానని హరీశ్‌‌‌‌‌‌‌‌ రావు హామీ ఇచ్చారు. కార్మికుల వైద్య సౌకర్యాలపై వైద్య శాఖతో కార్మిక శాఖ ఒప్పందం కుదుర్చుకుందని, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ ద్వారా క్యాన్సర్ చికిత్సకు ఐదు లక్షల వరకు, గుండె సంబంధిత చికిత్సలకు పది లక్షల వరకు బీమాను ఆగస్టు నుంచి ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. సిద్దిపేట పట్టణ శివార్లలోని మందపల్లిలో కార్మిక భవన్ నిర్మాణం కోసం ఎకరం స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. సభ నుంచే కార్మిక మంత్రి మల్లారెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. పలు సమస్యల గురించి తెలియజేయగా.. మల్లారెడ్డి సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కార్మిక భవన్లు మంజూరు చేస్తానని ప్రకటించారు.