రాత్రికి రాత్రే పట్టా భూములను 22A జాబితాలో చేర్చడం సర్కార్ కుట్ర: హరీశ్ రావు

రాత్రికి రాత్రే  పట్టా భూములను 22A జాబితాలో చేర్చడం సర్కార్ కుట్ర: హరీశ్ రావు

కాంగ్రెస్ పాలనలో ప్రజల  ఆస్తులకు రక్షణ లేదన్నారు మాజీమంత్రి హరీశ్ రావు.  కుత్బుల్లాపూర్ MJ గార్డెన్స్ లో 22A నిషేధిత భూముల బాధితులతో ముఖాముఖి నిర్వహించిన ఆయన..కాంగ్రెస్ వచ్చాకే లక్షల ఎకరాలు 22A లో చేర్చారని ఆరోపించారు.  రాత్రికి రాత్రే పట్టా భూములను 22A జాబితాలోకి చేర్చడం  కావాలని చేస్తున్న కుట్రగా అభివర్ణించారు.

 30, 40 ఏళ్లుగా ఇళ్లు కట్టుకుని ఉంటున్న పేదల భూములు కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టారని విమర్శించారు.  భూదాన్ భూమి పేరుతో మొత్తం సర్వే నంబర్ నే బ్లాక్ చేయడం ఏంటనిప్రశ్నించారు. ప్రజల ఆస్తిని కాపాడాల్సిన ప్రభుత్వమే కబ్జాదారుగా మారిందన్నారు. ఈ కుట్ర వెనుక ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి హస్తం ఉందన్నారు హరీశ్ రావు. 

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డబ్బు దాహమే ఈ ప్రజల దుఃఖానికి కారణమన్నారు  హరీశ్ రావు. రేవంత్ రెడ్డి, పొంగులేటి కలిసి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని ఆరోపించారు.  రెవెన్యూ మంత్రి తప్పు చేసి అధికారులపై నెట్టడం సిగ్గుచేటన్నారు.  కేసీఆర్  హయాంలో రైతు భూమికి పూర్తి రక్షణ ఉండేది  ఇలాంటి వేధింపులు లేవు, ప్రజల భూములకు ఢోకా లేదన్నారు. ఇప్పుడు రైతు భూమే ప్రమాదంలో పడింది, పేదల బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు హరీశ్.

 22A కుంభకోణంపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలన్నారు హరీశ్ . విచారణ జరిపిస్తే అసలు కబ్జాదారులు ఎవరో బయటపడతారని చెప్పారు.  పేదల భూములను లాక్కునేందుకే ప్రభుత్వం ఈ కొత్త ఎత్తుగడ వేసిందన్నారు.  22A పేరుతో భయపెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 
బాధితులు భయపడొద్దు, న్యాయపోరాటంలో BRS అండగా ఉంటుందని.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు.