భూమిపూజలో దూరంగా నిలబడిన హరీష్ రావు

భూమిపూజలో దూరంగా నిలబడిన హరీష్ రావు

హైదరాబాద్ సెక్రటేరియట్ ప్రాంగణంలో కొత్తభవన నిర్మాణ భూమిపూజ ఇవాళ సంప్రదాయపద్ధతిలో జరిగింది. వేద, మంత్రోచ్ఛారణల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ పూజా కార్యక్రమాలు నిర్వహించి… భూమిలోకి పలుగు దించారు. మట్టి తవ్వారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రమంత్రులు , హరీష్ రావు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , అధికారులు హాజరయ్యారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రెండున్నరేళ్ల తర్వాత ఇవాళ మొదటిసారి సెక్రటేరియట్ కు వచ్చారు. రాష్ట్రమంత్రులందరూ పూజా కార్యక్రమాలకు ముందుగా ఏర్పాటుచేసిన వేదిక దగ్గర కుర్చీలపై కూర్చున్నారు. కార్యక్రమానికి వచ్చిన కీలక నాయకుడు హరీష్ రావు మంత్రుల వేదికకు దూరంగా నిల్చుకున్నారు. అధికారులను, నాయకులను పలకరించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయనతో పాటు కార్యక్రమానికి వచ్చారు.

హరీష్ రావు, కేటీఆర్ ముచ్చట్లు

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నాయకులతో పాటు సెక్రటేరియట్ ప్రాంగణానికి వచ్చారు. సీఎం కోసం ఎదురుచూస్తున్న సీఎస్ ఎస్కే జోషి, ఇతర ఉన్నతాధికారులు కేటీఆర్ కు వెల్కమ్ చెప్పారు. అక్కడికి కొంత దూరంలో నిల్చున్న హరీష్ రావును కేటీఆర్ పలకరించారు. హరీష్ రావు, కేటీఆర్ కొద్దిసేపు ముచ్చటించారు.