- అప్రజాస్వామిక పద్ధతులకు పాల్పడుతున్న సర్కారు
ఉప్పల్, వెలుగు: తెలంగాణ అసెంబ్లీలో 'హేట్ స్పీచ్' బిల్లు తీసుకువచ్చి భారత రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్అంబేడ్కర్ అందించిన స్పూర్తికి తూట్లు పొడుస్తున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఠాగూర్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన 'డుసిమస్ వి లీడ్' ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ బిల్లు వల్ల వ్యక్తి స్వేచ్ఛ పూర్తిగా హరించబడుతుందన్నారు. ఏ మార్పు తీసుకురావాలన్నా రాజ్యాంగానికి లోబడి మాత్రమే ఉండాలని, వ్యక్తి స్వేచ్ఛకు సంకెళ్లు వేయాలని తెలంగాణ సర్కార్అప్రజాస్వామిక పద్దతులకు యత్నించడం ఎంత మాత్రం సహించరానిదన్నారు. తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలబడ్డది న్యాయవాదులేనని కితాబునిచ్చారు.
దేశంలో 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని, పేదలకు, గొంతులేని వారికి గొంతుకగా, న్యాయం దక్కని వారికి న్యాయం దక్కేలా పోరాడాలని కోరారు. ఓయూకు వచ్చినప్పుడల్లా తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన విద్యార్థులు గుర్తుకు వస్తారన్నారు. మహిళా రిజర్వేషన్ నేపథ్యంలో యువతులు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్వీ స్టూడెంట్ వింగ్ నాయకులు, లా స్టూడెంట్స్ పాల్గొన్నారు.
