గవర్నర్ ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా?: హరీశ్ రావు

గవర్నర్ ను  పిలవాలని రాజ్యాంగంలో ఉందా?: హరీశ్ రావు

సచివాలయం ప్రారంభోత్సవానికి పిల్వలేదన్న గవర్నర్ తమిళి సైకి మంత్రులు వరుస కౌంటర్లు వేస్తున్నారు. అసలు గవర్నర్ ను పిలవాలని రాజ్యాంగంలో ఏమైనా ఉందా? అంటూ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. వందేభారత్ రైలు ప్రారంభోత్సవానికి ప్రధాన మోడీ..రాష్ట్రపతిని పిలిచారా అని ఎదురు ప్రశ్న వేశారు. తనను పిల్వలేదని రాష్ట్రపతి ఎప్పుడైనా ప్రశ్నించారా.? అని అన్నారు. ఎవరిని పిలవాలన్నది ప్రభుత్వ ఇష్టమన్నారు.

గవర్నర్ బిల్లులు ఆపడం తప్ప సాధించిందేంటూ మండిపడ్డారు హరీశ్. సుప్రీం కోర్టు మెట్లెక్కితే తప్ప బిల్లులో కదలిక రాలేదన్నారు.  గవర్నర్ ప్రతిపక్ష నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏడు ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లులను గవర్నర్  ఆపడం రాజకీయం కాకపోతే ఏంటని ప్రశ్నించారు. అసలు  తాము రాజ్ భవన్ కు ఎందుకెళ్లాలని ప్రశ్నించారు. ఫ్రొఫెసర్ల నియామకంలో గవర్నర్అడ్డంకిగా మారారని విమర్శించారు.

గవర్నర్ తమిళి సై గతంలో పోటీచేస్తే ఎక్కడైనా గెలిచారా? అని ప్రశ్నించారు హరీశ్. కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా గెలిచారని చెప్పారు. కావాలనుకుంటే గవర్నర్ మళ్లీ బీజేపీలో చేరొచ్చని.. పోరాటం చేయొచ్చని అన్నారు హరీశ్.