హైదరాబాద్, వెలుగు: బతుకమ్మ చీరల పంపిణీని ఎందుకు ఆపేశారని ప్రశ్నిస్తే మంత్రి సీతక్క పొంతనలేని సమాధానం చెబుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. బతుకమ్మ చీరలకు మించిన ప్రయోజనాలను మహిళలకు అందిస్తున్నట్టుగా, భ్రమలు కల్పించేందుకు సీతక్క ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు గురువారం హరీశ్ రావు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహాలక్ష్మి స్కీమ్ కింద కాంగ్రెస్ సర్కార్ ఒక్కో మహిళకు రూ.25 వేల చొప్పున బాకీ పడిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కో మహిళకు నెలకు రూ.2.5వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కల్యాణ లక్ష్మి స్కీమ్ కింద ఇస్తామన్న తులం బంగారం కూడా అందించాలని కోరారు.
పత్తి రైతులను కేంద్రం మోసం చేస్తోంది
పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కేంద్ర విధానాల వల్ల తెలంగాణ పత్తి రైతులకు అన్యాయం జరుగుతోందని గురువారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. వన్ నేషన్, వన్ మార్కెట్ అంటూ ఊదరగొడుతున్న బీజేపీ, వన్ నేషన్, వన్ ఎంఎస్‌పీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
పత్తికి కేంద్రం చెల్లించే మద్దతు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఎందుకు ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘నాణ్యమైన పత్తిని పండిస్తున్న తెలంగాణ రైతు పట్ల ఎందుకీ వివక్ష? గుజరాత్ పత్తికి మద్దతు ధరగా క్వింటాకు రూ.8,257 చెల్లిస్తున్న కేంద్రం, తెలంగాణలో పండిస్తున్న పత్తికి రూ.7,521 మాత్రమే చెల్లించడం దుర్మార్గం”అని ఆయన మండిపడ్డారు.