
హైదరాబాద్, వెలుగు: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగడంతో వర్షానికి పంట తడిసి ముద్ద అవుతున్నదని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రాష్ట్రంలో ఏ కొనుగోలు కేంద్రం వద్ద చూసినా తడిసిన ధాన్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో ఆయన పోస్ట్ పెట్టారు. తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇవ్వాలని, కొనుగోళ్ళు వేగంగా జరిపి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పోలీసు పహారా మధ్య, కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సమీక్షలు చేసే సీఎం రేవంత్ రెడ్డి ఇకనైనా కండ్లు తెరవాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద వర్షం కారణంగా తడిసిన ధాన్యం ఫొటోలు, వీడియోలను జతచేసి పోస్టు చేశారు.
కొత్త ఉద్యోగులను సీఎం భయపెడుతున్నరు
ఉద్యోగాల్లో చేరుతున్న కొత్త ఏఈల్లో సీఎం రేవంత్రెడ్డి ఉత్సాహాన్ని నింపకుండా భయబ్రాంతులకు గురిచేస్తున్నారని బీఆర్ ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ కు నియామక పత్రాలు అందించి.. అది వారి ఘనతగా చెప్పుకునేందుకు తంటాలు పడుతున్నారని బుధవారం ఓ ప్రకటనలో ఆయన ఎద్దేవా చేశారు.