టెలిమెట్రీల సొమ్ము వాడుకుంటుంటే ఏం చేస్తున్నారు? : ఎమ్మెల్యే హరీశ్ రావు

టెలిమెట్రీల సొమ్ము వాడుకుంటుంటే ఏం చేస్తున్నారు? : ఎమ్మెల్యే హరీశ్ రావు
  •     రాష్ట్ర సర్కారుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల  లెక్కల కోసం టెలిమెట్రీ ఏర్పాటుకు కేటాయించిన రూ.4.18 కోట్ల నిధులను కృష్ణా బోర్డు దారి మళ్లిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూడటం సిగ్గుచేటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రేవంత్ సర్కార్ కావాలనే టెలిమెట్రీ ఏర్పాటును ఆలస్యం చేస్తూ కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా తరలించుకుపోయేలా సహకరిస్తున్నదని ఓ ప్రకటనలో ఆరోపించారు. "జూన్ 2016లో కృష్ణా బోర్డు సమావేశ నిర్ణయం ప్రకారం.. మొదటి దశలో 18 చోట్ల టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటయ్యాయి.  

రెండో దశలో మిగిలిన 9 చోట్ల ఇప్పటివరకు అమలు కాకపోవడం దురదృష్టకరం. టెలిమెట్రీ కోసం నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నిలదీయడం లేదు? కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడాల్సిన కృష్ణా బోర్డు.. రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని ఆసరాగా చేసుకొని తెలంగాణకు ఏపీ అన్యాయం చేస్తుంటే ఎందుకు స్పందించడం లేదు? తెలంగాణ, ఏపీ, కేంద్రంలోని బీజేపీ ఈ మూడూ కలిసి టెలిమెట్రీ ఏర్పాటును నిర్లక్ష్యం చేస్తూ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నాయి. 

టెలిమెట్రీల విషయంలో పురోగతి లేకున్నా రెండేండ్ల నుంచి కేంద్రం ప్రచారం మాత్రం చేసుకుంటోంది. పోలవరం, నల్లమల సాగర్ విషయంలో మొద్దు నిద్ర ప్రదర్శించినట్లే టెలిమెట్రీ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రూ.4.18 కోట్ల నిధులను వెంటనే రికవరీ చేసి, టెలిమెట్రీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలి" అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హరీశ్ డిమాండ్ చేశారు.

నిరుద్యోగుల గొంతులపై ఉక్కుపాదమా? 

నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లపై రేవంత్ సర్కారు దమనకాండ సాగిస్తోందని హరీశ్ రావు మండిపడ్డారు. ఎన్నికల ముందు అశోక్‌‌‌‌నగర్ లైబ్రరీ చుట్టూ చక్కర్లు కొట్టి.. నిరుద్యోగులను రెచ్చగొట్టి ప్రచారానికి వాడుకున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక అదే గొంతులపై ఉక్కుపాదం మోపుతున్నారని ఫైర్ అయ్యారు.

దిల్‌‌‌‌సుఖ్‌‌‌‌నగర్, అశోక్‌‌‌‌నగర్‌‌‌‌లో నిరసన తెలుపుతున్న నిరుద్యోగుల పట్ల పోలీసులు క్రూరంగా వ్యవహరించడం దారుణమన్నారు. గాయపడిన ప్రతి నిరుద్యోగికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని, దాడికి బాధ్యులైన పోలీసు అధికారులపై తక్షణ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని హరీశ్  డిమాండ్ చేశారు.