
- దశలవారీగా విడుదల చేస్తామని అసెంబ్లీలో చెప్పింది: హరీశ్‌రావ
- బకాయిలన్నీ వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయమై అసెంబ్లీలో తాను ప్రభుత్వాన్ని నిలదీస్తే.. విడతల వారీగా బకాయిలు విడుదల చేస్తామని చెప్పిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఏ ఏడాదికి ఆ ఏడాది క్లియర్ చేస్తామని చెప్పి.. మాట తప్పిందని పేర్కొన్నారు. బకాయిలన్నీ విడుదల చేయాలని విద్యాసంస్థల యాజమాన్యాలు మొత్తుకుంటున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడం సిగ్గుచేటని అన్నారు. సర్కారు నిర్లక్ష్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్ విద్యా సంస్థలు మూతపడే పరిస్థితి వచ్చిందని ఆదివారం ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
దాదాపు 13 లక్షల మంది స్టూడెంట్ల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని, సెమిస్టర్ పరీక్షలు కూడా వాయిదా వేసే పరిస్థితి వస్తుంటే విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ‘అల్లరి చేయొద్దు’ అని ఆర్థిక మంత్రి సుద్దులు చెప్పినంత మాత్రాన యాజమాన్యాలు, విద్యార్థుల గోడు తీరదని అన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులకు డీఏలు ఇవ్వాలని అడిగితే.. ‘నన్ను కోసుకొని తిన్నా పైసలు లేవు’ అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. లక్షల కోట్ల టెండర్లు ఎలా పిలుస్తున్నారని అడిగారు.
ఒకవైపు ఫీజు రీయింబర్స్మెంట్రాక, మరోవైపు ఫీజు బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి నెలకొన్నదని, సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి వచ్చిందని అన్నారు. ఇప్పటికైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.