ఆటోడ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి: హరీశ్‌‌రావు

ఆటోడ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి: హరీశ్‌‌రావు

హైదరాబాద్, వెలుగు: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్‌‌తో గిరాకీ తగ్గిపోయి ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌‌రావు విమర్శించారు. నిజామాబాద్‌‌లో ఆటోడ్రైవర్‌‌‌‌ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆయన స్పందించారు.  ‘‘బతుకు భారమై భార్యతో సహా, ప్రాణాలు కోల్పోయిన ఆటో సోదరుడి హృదయ విదారక ఘటన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదిలించకపోవడం బాధాకరం. తల్లి, తండ్రిని కోల్పోయి అనాథగా మారిన ఆ బిడ్డ భవిష్యత్తుకు ఎవరు బాధ్యత వహిస్తారు.

ఎవరు భరోసా ఇస్తారు. నిజామాబాద్ లో జరిగిన ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణం స్పందించి పది లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి.”అని హరీశ్‌‌ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో వరుసగా ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు వెంటనే నిర్లక్ష్యం వీడి ఆటో డ్రైవర్ల జీవన సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. ఆటో సోదరులు ధైర్యంగా ఉండాలని, తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని ఆయన సూచించారు.