
- 665 పేజీల ఫుల్ నివేదిక కావాలి
- సీఎస్‌కు హరీశ్‌రావు విజ్ఞప్తి
- కేసీఆర్, తన పేరుతో
- రెండు వేర్వేరు లేఖలు అందజేత
- కమిషన్ రిపోర్టుపై లీగల్‌గా ఫైట్చేయాలనే యోచనలో బీఆర్ఎస్ పెద్దలు
- ఇప్పటికే ఢిల్లీ వెళ్లి
- న్యాయ నిపుణులతో చర్చలు!
- నివేదికలో ఏముందో తెలుసుకుని సుప్రీంలో పిటిషన్ వేసేందుకు కసరత్తు
హైదరాబాద్, వెలుగు:కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ రిపోర్టును తమకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. ఆయన శుక్రవారం సెక్రటేరియెట్‌లో సీఎస్ రామకృష్ణా రావును కలిశారు. కమిషన్ రిపోర్టు ఇవ్వాలని కోరుతూ కేసీఆర్, తన పేరుతో రెండు వేర్వేరు లేఖలను అందజేశారు. కమిషన్ 665 పేజీలతో ఇచ్చిన ఫుల్ రిపోర్టును ఇవ్వాలని లేఖల్లో పేర్కొన్నట్టు తెలిసింది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన సమ్మరైజ్డ్రిపోర్టు కాకుండా.. కమిషన్ ఇచ్చిన ఒరిజినల్ రిపోర్టును ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.
రిపోర్టులో తమ పేర్లు కూడా ఉన్నట్టు బయటకు చెబుతుండడంతో.. ఆ రిపోర్టులో ఏముందో తెలుసుకునే అవకాశం తమకివ్వాలని సీఎస్‌ను హరీశ్‌రావు కోరినట్టు తెలిసింది. అయితే ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం చెబుతామని సీఎస్చెప్పినట్టు సమాచారం. ప్రభుత్వ నిర్ణయం మేరకు రిపోర్టు ఇచ్చే విషయంపై డెసిషన్తీసుకుంటామని స్పష్టం చేసినట్టు తెలిసింది. కాగా, లేఖలు ఇచ్చినట్టుగా సీఎస్‌నుంచి హరీశ్ అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకున్నారు. ఆయన వెంట పార్టీ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, బండారు లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్తదితరులు ఉన్నారు.
కేసీఆర్, హరీశే కారణమని తేల్చిన కమిషన్
కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై జస్టిస్పీసీ ఘోష్ నేతృత్వంలోని జ్యుడీషియల్‌కమిషన్17 నెలల పాటు విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డ్యామేజీలపైనా జస్టిస్ఘోష్ విచారణ జరిపారు. అధికారులతో పాటు కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ వాంగ్మూలాలను నమోదు చేశారు.
వివిధ ఆధారాలనూ సేకరించారు. వాటన్నింటి ఆధారంగా మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణం కేసీఆర్, హరీశ్ రావులేనని రిపోర్టులో తేల్చి చెప్పారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్లనూ మార్చేయడం వంటివన్నీ ఏకపక్ష నిర్ణయాలేనని స్పష్టం చేశారు. రిటైర్డ్ఇంజనీర్ల కమిటీ రిపోర్టును తొక్కిపెట్టడం దగ్గర్నుంచి.. బ్యారేజీల అంచనాల పెంపు, చెల్లింపులు సహా అనేక అక్రమాలు జరిగాయంటూ రిపోర్టులో పేర్కొన్నారు.
వాటన్నింటిపైనా కేబినెట్ఆమోదం లేకుండానే అప్పటి సీఎం కేసీఆర్ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారంటూ తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే దీనిపై లీగల్‌గా ముందుకు వెళ్లేందుకు.. అసలు రిపోర్టులో ఏముందో తెలుసుకునేందుకు పూర్తి రిపోర్టును బీఆర్ఎస్పెద్దలు అడుగుతున్నట్టు తెలిసింది. ఆ రిపోర్టులోని అంశాలను బట్టి సుప్రీంకోర్టులో పిటిషన్దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
నేరుగా సుప్రీంకోర్టుకు..
కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ రిపోర్టుపై లీగల్‌గానే ముందుకెళ్లాలని బీఆర్ఎస్ పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తున్నది. నేరుగా సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేసేందుకు రెడీ అవుతున్నట్టు చర్చ జరుగుతున్నది. అందులో భాగంగా హరీశ్‌రావు గురువారం హుటాహుటిన న్యాయవాదులతో కలిసి ఢిల్లీకి వెళ్లి పలువురు న్యాయ నిపుణులను కలిసినట్టు సమాచారం.
వాస్తవానికి గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ఎదుట రైతు ధర్నాలో హరీశ్ పాల్గొన్నారు. అయితే, కేసీఆర్ నుంచి ఫోన్ రావడంతో ధర్నా మధ్యలోనే అక్కడి నుంచి ఆయన వెళ్లిపోయారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో సమావేశ మయ్యారు. అంతేగాకుండా గురువారం సాయంత్రం కేటీఆర్‌కు కూడా కేసీఆర్ ఫోన్ చేసి ఫామ్‌హౌస్‌కు పిలిపించుకున్నారు.
ఇద్దరు నేతలతోనూ కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తున్నది. కేసీఆర్సూచనల మేరకు హరీశ్ ఢిల్లీ వెళ్లి అక్కడ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. వారిచ్చిన సూచనలతోనే కమిషన్ రిపోర్టును తమకు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖలు రాశారని సమాచారం.