స్కానింగ్​లు, టెస్ట్​లు బయటకు రాస్తే చర్యలు

స్కానింగ్​లు, టెస్ట్​లు బయటకు రాస్తే చర్యలు

మెదక్ : ‘‘సర్కార్ దవాఖాన్లలో అల్ట్రా సౌండ్ స్కానింగ్ మెషీన్​లు అందుబాటులోకి తెచ్చాం. అన్ని రకాల టెస్టులు చేసేందుకు ల్యాబ్ లు ఏర్పాటు చేశాం. స్కానింగ్ లు, టెస్ట్​లు బయట ప్రైవేట్​లో చేయించుకు రావాలని ఎక్కడైనా డాక్టర్​లు రాస్తే.. చర్యలు తీసుకుంటాం” అని మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. టెస్టులను బయటకు రాస్తే ఆ విషయాన్ని తన దృష్టికి తేవాలని ఆశా కార్యకర్తలకు సూచించారు. మెదక్ టౌన్​లో 100 బెడ్లతో నిర్మించిన మాతా శిశు సంక్షరణ కేంద్రం(ఎంసీహెచ్)ను హరీశ్ రావు శుక్రవారం ప్రారంభించారు. మెదక్ నియోజకవర్గ పరిధిలో ఎంపికైన100 మంది దళితబంధు లబ్ధిదారులకు వెహికల్స్​ పంపిణీ చేశారు. రూ.3 కోట్లతో నిర్మించనున్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్​కు శంకుస్థాపన చేశారు. స్కిల్​డెవలప్​మెంట్ ట్రైనింగ్ సెంటర్​ను, కనెక్ట్ ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్​ను కూడా ప్రారంభించారు.​ ఈ సందర్బంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. మెదక్​లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు త్వరలో ఉత్తర్వులు వెలువడుతాయని చెప్పారు. గర్భిణులను తమ ఆస్పత్రికి పంపిస్తే కమీషన్ ఇస్తామని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ఆశ చూపిస్తాయని, అలాంటి వాటికి లొంగొద్దని హెల్త్ స్టాఫ్ కు మంత్రి హితవు చెప్పారు. సర్కార్ దవాఖాన్లలో కాన్పులు, నార్మల్ డెలివరీలు పెరిగితే సంబంధిత డాక్టర్​లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకు ఇన్సెంటివ్స్ ఇచ్చే ఆలోచన ఉందన్నారు. పీహెచ్​సీలో పాము, కుక్కకాటు మందులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నామన్నారు.


ఆఫీసర్​లపై మంత్రి సీరియస్​
మెదక్ జిల్లాలోని సర్కార్ దవాఖాన్లలో ప్రసవాల సంఖ్య, ఆశాల పనితీరుపై రిపోర్టులు ఇవ్వకపోవడంతో వైద్య విధాన పరిషత్ ఆఫీసర్లపై హరీశ్ సీరియస్ అయ్యారు. సభలో మంత్రి స్పీచ్​ఇస్తుండగా పరిషత్ జాయింట్ డైరెక్టర్ పద్మ వచ్చారు. దీంతో ‘‘ఏమమ్మా ఇప్పుడా వచ్చేది? రిపోర్టులు ఇవ్వలేదు. మీటింగ్ అయిపోయాక ఇస్తావా? లేదా రేపు ఇస్తావా? వివరాలు లేకుంటే నేనేం మాట్లాడాలి?’’ అని అసహనం వ్యక్తం చేశారు. అంతకుముందు ఎంసీహెచ్ ప్రారంభం సందర్భంగా మెయిన్ రోడ్డు నుంచి ఆస్పత్రిదాకా  మట్టి రోడ్డు మాత్రమే ఉండటం చూసిన మంత్రి .. సీసీ రోడ్డు శాంక్షన్ అయినా ఎందుకు పూర్తి చేయలేదని కాంట్రాక్టర్, ఆఫీసర్​లపై మండిడ్డారు. ఆస్పత్రి ప్రారంభోత్సవం, దళితబంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమాల నిర్వహణ తీరుపైనా  ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.