హరీశ్‌‌రావు ఓ కలెక్షన్‌‌ కింగ్ : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హరీశ్‌‌రావు  ఓ కలెక్షన్‌‌ కింగ్ :  మంత్రి కోమటిరెడ్డి వెంకట్  రెడ్డి
  • కాంట్రాక్టర్ల దగ్గర వసూళ్లు చేయడానికే పనికొస్తడు
  • కాళేశ్వరంపై ఆయనకు అవగాహన లేదు
  • ఆయన చెప్తే మేము వినాల్నా?
  • అసెంబ్లీలో మండిపడ్డ మంత్రి వెంకట్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి హరీశ్  రావు ఓ కలెక్షన్  కింగ్  అని, కాంట్రాక్టర్ల వద్ద డబ్బులు వసూలు చేసుకునేందుకే ఆయన పనికొస్తాడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్  రెడ్డి విమర్శించారు. శనివారం అసెంబ్లీలో ఇరిగేషన్ పై శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా ఇరువురు నాయకుల మధ్య మాటల యుద్ధం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్  ఇంజినీర్, డిజైనర్, కాంట్రాక్టర్  సహా అన్నీ కేసీఆరే అని, ఆయనే అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్  చేశారు. హరీశ్  రావు మాటలకు విలువ లేదని కొట్టిపారేశారు. కాళేశ్వరం మీద ఆయనకు అవగాహన లేదన్నారు. అలాంటి కలెక్షన్  కింగ్ చెబితే తాము వినాలా అంటూ కోమటిరెడ్డి ఫైర్  అయ్యారు. 

ఈ వ్యాఖ్యలపై హరీశ్‌‌‌‌ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కలెక్షన్  కింగ్ అంటూ చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఏంటని ఆయన ప్రశ్నించారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌‌‌‌‌‌‌‌కు విజ్ఞప్తి చేశారు. అంతకముందు తన నియోజకవర్గంలో బ్రాహ్మణ వెల్లంల -ఉదయసముద్రం ప్రాజెక్ట్  గురించి కోమటిరెడ్డి మాట్లాడారు. ఈ ప్రాజెక్టు పనులు ఉమ్మడి రాష్ట్రంలోనే 80 శాతం  పూర్తయ్యాయన్నారు. 

మరో రూ.200 కోట్లు ఖర్చు చేస్తే లక్ష ఎకరాలకు సాగునీరు వచ్చే అవకాశం ఉండగా, బీఆర్ఎస్‌‌‌‌  అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్టు పనులను ఆపేసిందని ఆయన మండిపడ్డారు. ప్రాజెక్టును పూర్తి చేయాలని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్  దృష్టికి తాను వందసార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదని గుర్తుచేశారు. తనతో పాటు రాజగోపాల్  రెడ్డి కూడా అసెంబ్లీలో దీనిపై ప్రస్తావించారని.. అయినా పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వారు ప్రాజెక్టుల గురించి, రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.