
- అప్పుడు సర్పంచుల బిల్లులు పెండింగ్ పెట్టి.. ఇప్పుడు సానుభూతి పలుకులా: సీతక్క
- పదేండ్లు అధికారంలో ఉండి పంచాయతీలనుఎందుకు పట్టించుకోలే
- ప్రజా సేవకు వచ్చిన సర్పంచులను ఆత్మహత్యలు చేసుకునేలా చేశారు
- అధికారం పోయిందన్నఅక్కసుతోనే సర్కారుపై విమర్శలని ఫైర్
హైదరాబాద్, వెలుగు: సర్పంచులకు ఆనాడు బిల్లులు పెండింగ్ పెట్టి.. వాళ్ల ఆత్మహత్యకు కారణమైన బీఆర్ఎస్ నేతలే ఇప్పుడు వాళ్లపై సానుభూతి చూపుతున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. ఇందులో హరీశ్‌రావు నటన మరీ అద్భుతమని ఎద్దేవా చేశారు. ‘‘పదేండ్లు గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు నిధులివ్వకుండా.. సెంట్రల్ ఫండ్స్‌నూ డైవర్ట్ చేసి.. ఇప్పుడు నీతి సూక్తులు చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా చేసిన హరీశ్‌రావుకు సర్పంచుల పెండింగ్ బిల్లుల సంగతి తెలుసు. కానీ, ఇప్పుడు మాజీ సర్పంచులను కలిసి సానుభూతి చూపిస్తున్నారు’’ అని ఫైర్ అయ్యారు.
పదే పదే అబద్ధాలు చెప్తే అవి నిజాలు కావని మంత్రి చురకలంటించారు. ఈ మేరకు మంత్రి సీతక్క గురువారం మీడియాకు ప్రకటన రిలీజ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన పంచాయతీలను బాగుచేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని స్పష్టం చేశారు. దేశ చరిత్రలో బిల్లుల కోసం సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నది బీఆర్ఎస్ సర్కారులోనేనని విమర్శించారు.
“ప్రజాసేవ కోసం వచ్చిన సర్పంచులను పాడెనెక్కించింది మీరే. గ్రామ పంచాయతీల సమస్యలపై మీరు మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే. అధికారం పోయిందన్న అక్కసు తప్ప పల్లెలపై మీకు ప్రేమ లేదు. ఉంటే మీరు పదేండ్లలో గ్రామపంచాయతీలను ఎందుకు పట్టించుకోలేదు?” అని మంత్రి ప్రశ్నించారు. పెండింగ్ బిల్లులు దశల వారీగా రిలీజ్ చేస్తున్నామని.. అయినా, తమ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
రూ.431 కోట్ల 15వ ఆర్ధిక సంఘం నిధులతో పాటు అదనంగా రూ.323.99 కోట్ల సీడీపీ నిధులను గ్రామపంచాయతీలకు విడుదల చేశామన్నారు. పంచాయతీ కార్మికులకు జీతాలు రిలీజ్ చేయలేదని హరీశ్ అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఇటీవల రూ.150 కోట్లు రిలీజ్చేశామని మంత్రి తెలిపారు.
ఆదివాసీ గూడేల అభివృద్ధే నిజమైన అభివృద్ధి
దేశంలోని మారుమూల ప్రాంతాలు, ఆదివాసీ గూడేలు అభివృద్ధి జరిగినప్పుడే నిజమైన అభివృద్ధి అని మంత్రి సీతక్క అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని అంబేద్కర్ యూనివర్సిటీ, ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో “ఆదివాసీ జీవనోపాధి పద్ధతులు: సాధికారత సాధనలో సమస్యలు, వ్యూహాలు” అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ సదస్సుకు మంత్రి హాజరై మాట్లాడారు. గత కొన్నేండ్లుగా ఆత్మగౌరవం కోసం ఆదివాసీలు పోరాటాలు చేస్తున్నారని, ఆ పోరాటం కొనసాగుతూనే ఉందని పేర్కొన్నారు. ఆదివాసీల సమస్యల పరిష్కారం, సాధికారతపై మేధావులు ఇలాంటి కాన్ఫరెన్స్ లు నిర్వహించి, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలకు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు.
అంగన్ వాడీల్లో ప్లే స్కూళ్లు..
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చాక అంగన్‌వాడీల్లో ప్లే స్కూల్స్‌ను ప్రారంభిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ అంశంపై గత నెలలో సీఎంతో చర్చించామని తెలిపారు. ఈ నెల 13 నుంచి రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల వారీగా రోజుకో జిల్లాలో తమ శాఖలకు సంబంధించి కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్‌ఆర్) ఫండ్స్‌ను గ్రామాల్లో వినియోగించాలని తాను చేసిన సూచనపై సానుకూలంగా స్పందించిన ఐటీ కంపెనీలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. దీంతో గ్రామాల్లో మేలైన మార్పులు చోటుచేసుకుంటాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.