హరీశ్ రావు మతిభ్రమించి మాట్లాడుతున్నడు : అన్వేశ్​ రెడ్డి

హరీశ్ రావు మతిభ్రమించి మాట్లాడుతున్నడు : అన్వేశ్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి హరీశ్ రావు మతిభ్రమించి మాట్లాడుతున్నారని పీసీసీ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మండిపడ్డారు. పంటనష్టంపై బీఆర్ఎస్ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్​ అయ్యారు. ఒకరేమో 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంటున్నారని, హరీశ్ మాత్రం 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెబుతున్నారన్నారు. ఆయన ఏ లెక్కల ఆధారంగా ఈ వివరాలు చెబుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. మంగళవారం గాంధీభవన్‌‌‌‌‌‌‌‌లో అన్వేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

 హరీశ్ రావు అబద్ధాలు చెప్పి రైతులను గందరగోళానికి గురి చేస్తురన్నారని, బాధ్యత గల మనిషిగా నిజాలు మాట్లాడాలని హితవు పలికారు. 10 జిల్లాల్లో  ప్రాథమిక అంచనా ప్రకారం 40 వేల ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం జరి గిందనేది వాస్తవమన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే పంట నష్టాన్ని అంచనా వేయా లని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, ఎకరానికి రూ.10 వేల నష్టపరిహారం ఇస్తామని చెప్పారని అన్వేష్ రెడ్డి అన్నారు.  పంట నష్ట జరిగినప్పుడు సర్వేల ఆధారంగా పరిహారం చెల్లిస్తారని ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన హరీశ్ రావుకు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. 

‘బీఆర్ఎస్ హయాంలో పంటనష్టం జరగ్గానే పరిహారం ఇచ్చారా? కనీసం నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించిన మొఖాలేనా మీవి? గత పదేండ్లలో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన ఎంత మంది రైతులకు పరిహారం ఇచ్చారో చర్చకు వస్తారా?’ అని హరీశ్​కు అన్వేష్ రెడ్డి సవాల్ విసిరారు.