
- సీఎం రేవంత్‌కు హరీశ్ రావు లేఖ
హైదరాబాద్, వెలుగు: పంచాయతీరాజ్ శాఖలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, నిధులు విడుదల చేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్యం కుంటుపడిందని లేఖలో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు జీతాలు అందడం లేదన్నారు.
వేతనాలు అందకపోవడంతో పనులు మానేశారని, దీంతో గ్రామాల్లో చెత్త సేకరణ ఆగిపోయిందన్నారు. ఈ కారణంగా గ్రామాల్లో విషజ్వరాలు ప్రబలుతున్నాయన్నారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు కృషి చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. పారిశుద్ధ్య కార్మికులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని తెలిపారు.