టెట్ నిర్వహించండి.. సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు లేఖ

టెట్ నిర్వహించండి.. సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు లేఖ

హైదరాబాద్, వెలుగు: టెట్ నిర్వహించి డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సీఎం రేవంత్‌ రెడ్డికి లేఖ రాశారు. టెట్ నిర్వహించకుండానే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడంతో సుమారు 7 లక్షల మంది డీఎడ్‌, బీఎడ్‌ క్వాలిఫైడ్ నిరుద్యోగులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ‘‘డిసెంబర్​లో​ డీఎడ్, బీఎడ్ కోర్సులు పూర్తి చేసుకున్నోళ్లు దాదాపు 50 వేల మందికి పైగా ఉన్నారు. టెట్​లో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే డీఎస్సీకి దరఖాస్తు చేయడానికి అర్హులవుతారనే విషయం మీకు తెలిసిందే.

గతేడాది సెప్టెంబర్​లో బీఆర్ఎస్ ప్రభుత్వం టెట్ నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక టెట్ నిర్వహించలేదు. టెట్ కోసం దాదాపు 7 లక్షల మందికి పైగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి, డీఎస్సీ నోటిఫికేషన్ తో పాటు టెట్ నిర్వహించి విద్యార్థులు, నిరుద్యోగుల అవకాశాలు దెబ్బతినకుండా చూడాలని మనవి చేస్తున్నాను”అని సీఎంకు రాసిన లేఖలో హరీశ్‌ వివరించారు.