మల్కాజిగిరిని దత్తత తీసుకుంటున్న: హరీష్రావు

మల్కాజిగిరిని దత్తత తీసుకుంటున్న: హరీష్రావు
  • ప్రజా ఆశీర్వాద సభలో హరీశ్​రావు
  • సెగ్మెంట్​ను మల్లారెడ్డి.. నేను కాపాడుకుంటం
  • మైనంపల్లి, ఆయన కొడుక్కు ఒటమి తప్పదని వెల్లడి

సికింద్రాబాద్, వెలుగు: మల్కాజిగిరి నియోజకవర్గాన్ని మంత్రి మల్లారెడ్డి, తాను కలిసి రెండు కండ్లలా కాపాడుకుంటామని, అభివృద్ధి కోసం నియోజకవర్గాన్ని తాను దత్తత తీసుకుంటున్నానని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఒక వైపు నేను.. మరోవైపు మల్లారెడ్డి కలిసి జోడెద్దుల్లా నియోకవర్గాన్ని రక్షించుకుంటామన్నారు. గురువారం జరిగిన మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ, ర్యాలీకి హరీశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు మంచి వ్యక్తికి గుండాగిరి చేసే వ్యక్తికి మధ్య నడుస్తున్నాయి. బెదిరింపులు, గుండాగిరికి ఇక్కడ తావులేదని చెప్పారు.

 ‘‘ఎప్పుడైనా, ఎక్కడైనా మంచే గెలుస్తుంది. ప్రజలు మంచివైపే నిలుస్తరు. మైనంపల్లి హన్మంతరావు పార్టీ నుంచి ఎందుకు వెళ్లిపోయాడో అందరికి తెలుసు. తన ముద్దుల కొడుక్కు కేసీఆర్ టికెట్ ఇవ్వనంటే పార్టీ నుంచి వెళ్లిపోయాడు. మెదక్, మల్కాజిగిరి రెండింటిలోనూ వాల్లిద్దరికి ఓటమి తప్పదు. రౌడీల రాజ్యాన్ని పారదోలి ప్రశాంతమైన మల్కాజిగిరిని ఏర్పాటు చేసుకుందాం. విద్యావంతుడు, మంచి మనసున్న మర్రి రాజశేఖర్​రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి” అని హరీశ్​ అన్నారు.
మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మల్కాజిగిరికి ఐదేండ్లుగా పట్టిన శని వీడిందని అన్నారు.

‘‘మైనంపల్లి హన్మంతరావు నువ్వు ఓ పెద్ద పహిల్వాన్ అనుకుంటున్నావా? మమ్మల్ని తిడితే పెద్ద నాయకుడివి అయిపోతా అనుకుంటున్నావా? అసలు నువ్వు నాయకుడివే కాదు. నువ్వొక మచ్చర్ పహిల్వాన్​వి.నలుగురు బాక్సర్లను, ఓ పదిమంది రౌడీలను వెంటబెట్టుకున్నంత మాత్రాన ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరు. దమ్మూ, ధైర్యం ఉంటే ప్రజా క్షేత్రంలో గెలిచి చూపించు” అని సవాల్ విసిరారు.