మాకేం కుళ్లు, కడుపునొప్పి లేదు..రేవంత్ కామెంట్లను ఖండించిన హరీశ్​

మాకేం కుళ్లు, కడుపునొప్పి లేదు..రేవంత్ కామెంట్లను ఖండించిన హరీశ్​

హైదరాబాద్, వెలుగు : నర్సులకు ఉద్యోగాలు ఇవ్వడంలో తమకేమీ కుళ్లు, కడుపునొప్పి లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌ రావు అన్నారు. ఆ ఉద్యోగాలు కాంగ్రెస్  ప్రభుత్వమే ఇచ్చినట్లు సీఎం చెప్పుకోవడాన్నే తాము తప్పు పడుతున్నామని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం వ్యవహారం చెప్పేది కొండంత, చేసేది గోరంత అన్నట్టు ఉందన్నారు. ఎల్బీ స్టేడియంలో నర్సింగ్  ఆఫీసర్లకు నియామకపత్రాల అందజేత పేరిట తామే రిక్రూట్ మెంట్  చేసినట్లు రేవంత్  డబ్బాకొట్టుకున్నారని దుయ్యబట్టారు.

తమ ప్రభుత్వ హయాంలో జరిగిన భర్తీ ప్రక్రియను కాంగ్రెస్  ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లోనే స్టాఫ్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి, అపాయింట్ మెంట్లు ఇచ్చారా అని హరీశ్‌‌‌‌  ప్రశ్నించారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తారనుకున్న నిరుద్యోగుల ఆశలపై సీఎం నీళ్లు చల్లారని, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే స్వాగతిస్తామని హరీశ్‌‌‌‌  పేర్కొన్నారు.