రైతుల నోటిబుక్క ఎత్తగొట్టింది.. కాంగ్రెస్​ ఈసీకి ఫిర్యాదు చేసి రైతు బంధు ఆపింది: హరీశ్​రావు

రైతుల నోటిబుక్క ఎత్తగొట్టింది.. కాంగ్రెస్​ ఈసీకి ఫిర్యాదు చేసి రైతు బంధు ఆపింది: హరీశ్​రావు

హైదరాబాద్, వెలుగు: రైతుల నోటికాడ బుక్క కాంగ్రెస్​పార్టీ ఎత్తగొట్టిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం రాత్రి తెలంగాణ భవన్​లో బీఆర్ఎస్​పార్లమెంటరీ పక్షనేత కె. కేశవరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుబంధు ఆపాలని అక్టోబర్​23న మాణిక్​రావు ఠాక్రే కేంద్ర ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేశారని, ఆరోజే ఢిల్లీలో రేవంత్​రెడ్డి, ఉత్తమ్​కుమార్​రెడ్డి ప్రెస్​మీట్ ​పెట్టి ఈ విషయం చెప్పారన్నారు. రైతుబంధు ఆన్​గోయింగ్ ​స్కీం అని సీఈసీని అనుమతి కోరితే పర్మిషన్​ఇచ్చిందని, దాన్ని తాను స్వాగతించాను తప్ప ఎలక్షన్​ కమిషన్​పెట్టిన ఆంక్షలను ఎక్కడా అతిక్రమించలేదన్నారు. దానిపై పీసీసీ వైస్​ ప్రెసిడెంట్​ నిరంజన్​ ఎలక్షన్​ కమిషన్​కు మళ్లీ కంప్లైంట్​ చేసి రైతుల ఖాతాల్లో డబ్బులేయకుండా అడ్డుకున్నారని తెలిపారు. 

రైతుబంధుకు ఎలక్షన్​ కమిషన్​ అనుమతి ఇచ్చినప్పుడు ఎలక్షన్​కమిషన్, బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్​బంధమని రేవంత్​ ఆరోపించారే తప్ప రైతులకు సాయం అందించే కార్యక్రమాన్ని స్వాగతించలేదని తెలిపారు. రైతులంటే రేవంత్​కు ప్రేమ ఉంటే రైతుబంధు సాయం పంపిణీని స్వాగతించే వారని గుర్తు చేశారు. రైతుల ఖాతాల్లో డబ్బులు వేసే టైంలో ఫిర్యాదు చేసి రైతుల నోటికాడి బుక్కను కాంగ్రెస్​ లాగేసిందన్నారు. దొంగే దొంగ అన్నట్టుగా కాంగ్రెస్​ పరిస్థితి ఉందన్నారు. వంద ఎలుకల్ని తిన్న పిల్లి.. నేను శాకాహారి అన్నట్టుగా వారి తీరు ఉందన్నారు. కాంగ్రెస్​‘చేతి’ని అడ్డం పెట్టి రైతుబంధును ఆపలేరన్నారు. రైతుబంధు సృష్టికర్త కేసీఆర్​అని.. ఆ పథకంపై ప్రతిపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని అన్నారు. రైతులను మోసం చేసిన కాంగ్రెస్​పార్టీకి ఈనెల 30న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు.

పంట దెబ్బతింటే పైసా ఇవ్వలేదు

కాంగ్రెస్​కు రైతులంటేనే గిట్టదని, అది ఎప్పుడూ రైతు వ్యతిరేక పార్టీయేనన్నారు. ఉచిత కరెంట్​ను ఉత్త కరెంట్​ చేసిందని, కాంగ్రెస్​ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆ పార్టీది రైతు వ్యతిరేక వైఖరేనని చెప్పారు. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు రూ.4 వేల చొప్పున ఇచ్చేవారని, కాంగ్రెస్​ గెలిచిన వెంటనే ఆ పథకాన్ని రద్దు చేశారన్నారు. తెలంగాణలో గెలిచి రైతుబంధును రద్దు చేయాలని కాంగ్రెస్​ కుట్ర చేస్తోందన్నారు. ఉత్తమ్ ​రైతుబంధును దుబారా అంటున్నారని, రేవంత్​ రైతులను బిచ్చగాళ్లు అంటున్నారని గుర్తు చేశారు. 

కాంగ్రెస్ ​అధికారంలో ఉన్నప్పుడు అర్ధరాత్రి కరెంట్​ఇచ్చి రైతులను అరిగోస పెట్టిందని, ఎరువులు, విత్తనాలను పోలీస్​స్టేషన్ల ముందు లైన్​లో నిలబెట్టి పంపిణీ చేస్తూ బాధ పెట్టిందన్నారు. ప్రాజెక్టులకు పెండింగ్ ​ప్రాజెక్టులు అని పేరు పడిందని గుర్తుచేశారు. ఉమ్మడి ఏపీలో నీలం తుఫాను దాటికి ఆంధ్రా ప్రాంతంలో పంటలు దెబ్బతింటే సాయం ఇచ్చిన అప్పటి పాలకులు తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ ​జిల్లాల్లో పంటలు దెబ్బతింటే పైసా ఇవ్వలేదన్నారు. దీనికి వ్యతిరేకంగా అసెంబ్లీలోని సీఎం చాంబర్​ఎదుట తాము ఆందోళన చేస్తుంటే తమను తొక్కుకుంటూ పోయారే తప్ప సాయం ఇవ్వలేదన్నారు. వ్యవసాయం దండగ అన్న నాయకుడి వారసుడు రేవంత్ అని ఎద్దేవా చేశారు. అందుకే ఆయన మూడు గంటల కరెంట్​చాలు అన్నారని, కర్నాటక డిప్యూటీ సీఎం ఐదు గంటల కరెంట్​చాలు అంటున్నారని తెలిపారు. 

కాంగ్రెస్, బీజేపీ దొందు దొందే​

కాంగ్రెస్​ గ్యారంటీలను అమలు చేస్తామని అభ్యర్థులు బాండ్​ పేపర్లు రాసి ఇస్తున్నారని.. అవి చిత్తు కాగితాలని హరీశ్​రావు అన్నారు. కర్నాటకలో రాహుల్​గాంధీ 2.50 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అటువైపే చూడటం లేదన్నారు. ‘‘రాహుల్​కు పోవాల్సింది చిక్కడపల్లికి కాదు.. ఆయనకు దమ్ముంటే బెంగళూరుకు పోయి నిరుద్యోగులతో మాట్లాడాలి. తెలంగాణ ఉద్యమాల గడ్డ.. ఇక్కడికి ఎవరొచ్చి మాట్లాడినా ప్రజలు నమ్మరు. కేసీఆర్​మూడోసారి గెలిచి హ్యాట్రిక్​కొడతారు. 80 సీట్లలో గెలుస్తం”అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ దొందు దొందేనన్నారు. 

కేంద్రం బోర్ల కాడ మీటర్లు పెట్టాలని చెప్తే కాంగ్రెస్​పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని, కేసీఆర్​ఒక్కరే మీటర్లు పెట్టేది లేదని తేల్చిచెప్పారన్నారు. రేపు కాంగ్రెస్​గెలిస్తే మోటార్ల కాడ మీటర్లు పెడతారని హెచ్చరించారు. డిసెంబర్​3న బీఆర్ఎస్​గెలుస్తుందని, 6 న రైతుబంధు సాయం ఇస్తామన్నారు. రైతుల విషయంలో కాంగ్రెస్​ది కపట నాటకమని, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపే గానీ తెలుపు కాదు అనడానికి రైతుబంధు సాయం ఆపడమే పెద్ద ఉదాహరణ అన్నారు. రైతుబంధు సాయం విషయంలో తాను హరీశ్​రావును తప్పుబట్టినట్టుగా వార్తలు ప్రసారం చేయడం తగదని ఎంపీ కె. కేశవరావు అన్నారు. రైతుబంధు సాయం పంపిణీని అనుమతిస్తూ ఈసీ ఇచ్చిన గైడ్​లైన్స్​ను హరీశ్​అతిక్రమించలేదన్నారు. రాజకీయ పార్టీలు కొట్లాడుకోవాలే తప్ప రైతుల పొట్టకొట్టవద్దని కూడా తాను కోరానని తెలిపారు. ఇప్పటికైనా తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సోమ భరత్, శ్రీనివాస్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.