ప్రభుత్వమంటే రియల్ ఎస్టేట్ కాదు..అన్నింటిలో లాభాలు చూడొద్దు: హరీశ్ రావు

ప్రభుత్వమంటే రియల్ ఎస్టేట్ కాదు..అన్నింటిలో లాభాలు చూడొద్దు: హరీశ్ రావు
  • సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌పై మండిపడ్డ హరీశ్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వమంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు అని, సంక్షేమ కార్యక్రమాల్లో లాభనష్టాలు చూడొద్దని మాజీ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు అన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులతో నష్టమే తప్ప లాభం లేదని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి చేసిన కామెంట్లపై హరీశ్‌‌‌‌‌‌‌‌ మండిపడ్డారు. మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చులో కూడా లాభం తీయాలనుకునేవారు వ్యాపారులు అవుతారు తప్ప పాలకులు కాలేరని ఆయన దుయ్యబట్టారు. మిషన్ భగీరథలో లాభం వెతికేవాడు ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం అని మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రజలకు నిరంతరం మంచినీరు అందించాలనే ఉద్దేశ్యంతో మిషన్ భగీరథ పథకాన్ని తెచ్చామన్నారు. ఈ స్కీమ్ కోసం తమ ప్రభుత్వం రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తే, దాన్ని రూ. 50 వేల కోట్లకు పెంచి చెబుతున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు. 2014కు ముందు 30 శాతం ఇండ్లకు మాత్రమే నల్లాల ద్వారా మంచినీటి సౌకర్యం ఉండేదని, మిషన్ భగీరథతో అదిప్పుడు 100 శాతానికి చేరుకుందన్నారు. మంచినీటి సౌకర్యం కల్పించడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో రోగాలు తగ్గాయన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని ప్రజల ఆరోగ్యం కాపాడిన గొప్ప సంజీవనిగా చూడాలి తప్ప, అందులో లాభనష్టాలు బేరీజు వేసుకోవడం ఒక ప్రభుత్వాధినేతకు తగదని హరీశ్‌‌‌‌‌‌‌‌ సలహా ఇచ్చారు. 

3 నెలలు కాలే, వేల కోట్ల అప్పులెందుకు తెచ్చిన్రు?

కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో పెరిగిన ఆయకట్టును లెక్కలతో సహా చెప్పినా ప్రభుత్వానికి చెవికెక్కడం లేదని హరీశ్ విమర్శించారు. ఎస్సార్​ఎస్పీ ద్వారా అటు కోదాడ, ఇటు డోర్నకల్ వరకు నీరందించగలిగామంటే అది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పనుల వల్లనే అని ఆయన పేర్కొన్నారు. బీడువడిన భూముల్లో సిరులు పండుతుంటే రైతులు పడే సంతోషం చూడాలి తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారి మనస్తత్వంతో లాభ నష్టాలు చూడొద్దన్నారు. అప్పుల గురించి విమర్శలు చేస్తున్న రేవంత్‌‌‌‌‌‌‌‌, 2024–-25 బడ్జెట్​లో లోటును అప్పుల ద్వారా సమకూర్చుకుంటామని ఎందుకు చెప్పారని హరీశ్‌‌‌‌‌‌‌‌ ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కూడా కాకముందే వేల కోట్ల అప్పులు ఎందుకు తెచ్చారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా విమర్శలు ఆపి, ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ‘‘రేవంత్ రెడ్డి ప్రతీ సారి నా ఎత్తు గురించి వ్యాఖ్యానిస్తున్నారు. నేను కూడా మీ ఎత్తు గురించి మాట్లాడితే సంస్కారవంతంగా ఉండదు. ఎవరెత్తు ఎంత అనేది ప్రజలకు అవసరం లేదు. ప్రజలకోసం ఎవరెంత  ఆలోచిస్తున్నారో, ఎవరెంత పనిచేస్తున్నారో మాత్రమే వారికి అవసరం”అని హరీశ్ మండిపడ్డారు.

నో ఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌.. నో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ అంటిరి కదా?

హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని హరీశ్‌‌‌‌‌‌‌‌రావు దుయ్యబట్టారు. అధికారంలోకి రాగానే, ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్, నేడు మాట తప్పిందని ఆయన మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ పేరిట ఫీజు వసూలు చేసేందుకు రేవంత్ సర్కారు రెడీ అయిందని హరీశ్ ట్వీట్ చేశారు. నో ఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, - నో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అంటూ గతం లో ప్రజలను రెచ్చగొట్టి ఇపుడు ఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు ఫీజులు వసూలు చేస్తామనడం కాంగ్రెస్ నేతల మోసపూరిత మాటలకు నిదర్శనం అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, గతంలో చేసిన ప్రకటనలకు అనుగుణంగా ఎల్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ను ఎలాంటి ఫీజులు లేకుండా అమలు చేయాలన్నారు. లేదంటే మోసపూరిత హామీ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.