
- కొత్తగా 77 టెస్టులను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
- పలు జిల్లాల్లో రేడియాలజీ సెంటర్లు ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లలో ఇకపై 134 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇప్పటి వరకు 57 రకాల టెస్టులు చేస్తుండగా, ఇప్పుడు మరిన్ని సౌలతులు కల్పించి మరో 77 రకాల టెస్టులను కూడా అందుబాటులోకి తెచ్చామని ఆయన చెప్పారు. ఈ కొత్త టెస్టులను శనివారం హైదరాబాద్ లోని కొండాపూర్ ఏరియా హాస్పిటల్ నుంచి హరీశ్ రావు ప్రారంభించారు.
..ఇకపై 134 టెస్టులు
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు. ‘‘ప్రభుత్వ దవాఖాన్లకు వచ్చే పేషెంట్లకు అన్ని రకాల టెస్టులు, స్కాన్లు ఉచితంగా చేస్తున్నాం. ఇందుకోసం తెలంగాణ డయాగ్నస్టిక్ సేవలను విస్తరిస్తున్నాం. ప్రతి జిల్లాకో డయాగ్నస్టిక్ సెంటర్‌ను అందు బాటులోకి తెస్తున్నాం. ఇప్పటివరకు టీ డయాగ్నస్టిక్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 57.68 లక్షల మంది పేషెంట్లకు 10 కోట్లకు పైగా టెస్టులు చేశాం” అని హరీశ్ వెల్లడించారు. కాగా, రంగారెడ్డి (కొండాపూర్), సూర్యాపేట, వనపర్తి, వరంగల్ (నర్సంపేట), యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఏర్పాటు చేసిన రేడియాలజీ సెంటర్లను కూడా మంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు.