కేంద్రం మితిమీరిన అప్పులు చేస్తోందన్న హరీష్ రావు  

కేంద్రం మితిమీరిన అప్పులు చేస్తోందన్న హరీష్ రావు  

హైదరాబాద్‌‌, వెలుగు: కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది కాబట్టి ప్రధాని మోడీ ఫొటోను పెట్టాలన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌‌ మాటలు సరికాదని మంత్రి హరీశ్‌‌రావు అన్నారు. ప్రధాని మోడీ గతంలో గుజరాత్‌‌ సీఎంగా ఉన్నప్పుడు అప్పటి యూపీఏ ప్రధాని మన్మోహన్‌‌ సింగ్‌‌ ఫొటోలను రేషన్‌‌ షాపుల్లో పెట్టారా? అని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన ప్రశ్నించారు. ఎఫ్‌‌ఆర్బీఎం చట్టాన్ని పునః సమీక్షించాలన్న 15వ ఆర్థిక సంఘం సిఫార్సులపై ప్రశ్నించిన మీడియాకు కేంద్ర మంత్రి సరైన సమాధానం చెప్పలేదన్నారు. రాజ్యాంగం ప్రకారం అప్పులను నియంత్రించే హక్కు కేంద్రానికి ఉందని, కానీ అదే కేంద్రం పరిమితులకు మించి, బడ్జెట్ లో పెట్టకుండా కూడా అప్పులు చేస్తోందన్నారు.

మోడీ పాలనలో జీడీపీ క్షీణిస్తోందని.. 2016 -–17లో 8.26 శాతం ఉండగా 2019– -20లో 3.66 శాతానికి పడిపోయిందని తెలిపారు. రూపాయి బలహీన పడిందని, నిత్యావసరాలు, పెట్రోల్‌‌, డీజిల్‌‌, గ్యాస్‌‌ ధరలు భారీగా పెరిగాయన్నారు. రాష్ట్రాలకు పన్నుల్లో వాటా ఎగ్గొట్టడం కోసమే సెస్సుల రూపంలో పన్నులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాలకు పన్నుల్లో 41 శాతం వాటా దక్కాల్సి ఉండగా, 29.6 శాతానికే పరిమితం చేశారన్నారు. రైతు ఆత్మహత్యలపైనా బురద చల్లారని, ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం తెలంగాణలోనే తక్కువ ఆత్మహత్యలు ఉన్నాయన్నారు.