వనపర్తి జిల్లాలో కొండెక్కిన గుడ్డు ధర..ఆందోళనలో వంట ఏజెన్సీలు

వనపర్తి జిల్లాలో  కొండెక్కిన గుడ్డు ధర..ఆందోళనలో వంట ఏజెన్సీలు
  •     తగ్గిన గుడ్ల ఉత్పత్తి
  •     రెండు నెలల్లో రూ.2.50 పెరిగిన రేట్

వనపర్తి, వెలుగు: కోడిగుడ్డు ధర కొండెక్కడంతో పాఠశాలల్లో స్టూడెండ్లకు మధ్యాహ్నం భోజనాన్ని వండి పెట్టే ఏజెన్సీ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. గుడ్డు ధర అమాంతం రూ.8కి పెరగడంతో ప్రజలు కూడా ధర ఎక్కువ కావడంతో వాడకం తగ్గించారు. రెండు నెలల కింద ఒక్కో కోడిగుడ్డు రూ.6 ఉండగా, ప్రస్తుతం రూ.8 నుంచి రూ.8.50  వరకు పలుకుతోంది. 

సామాన్యంగా చలికాలంలో గుడ్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ధరలు పెరగడంతో వినియోగం కూడా తగ్గింది. ఇదిలా ఉంటే గురుకులాల విద్యార్థులకు సప్లై చేసే గుడ్ల పరిమాణం తక్కువగా ఉంటోంది. గుడ్ల ధరలు పెరిగిన నేపథ్యంలో కాంట్రాక్టర్లు నిర్ధారిత సైజ్​ కన్నా తక్కువ సైజ్​ గుడ్లు సప్లై చేస్తున్నారు. 

స్టూడెంట్లకు గుడ్డు కోత?

జిల్లాలో ప్రైమరీ, అప్పర్​ ప్రైమరీ, హైస్కూళ్లతో కలిపి 534 స్కూల్స్​ ఉన్నాయి. ఈ స్కూళ్లలో 56 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. స్కూళ్లలో సోమ, బుధ, శుక్రవారాల్లో వారానికి మూడు గుడ్ల చొప్పున అందించాలి. 

వంట ఏజెన్సీలకు ఒక్కో గుడ్డుకు ప్రభుత్వం రూ.6 ఇస్తోంది. ధర పెరగడంతో కొన్ని స్కూళ్లలో ఏజెన్సీలు వారానికి రెండు గుడ్లే ఇస్తుండగా, మరికొన్ని స్కూళ్లలో  విద్యార్థుల అటెండెన్స్​ను బట్టి అడ్జస్ట్​ చేస్తున్నారు. ఒక్కో గుడ్డు మీద రూ.2 నుంచి రూ.2.50 అదనంగా భరించడం భారంగా మారిందని ఏజెన్సీ నిర్వాహకులు  చెబుతున్నారు.

సైజ్​ తగ్గిన గుడ్డు

జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, కేజీబీవీ విద్యార్థులకు సరఫరా చేసే గుడ్లు నిర్ధారిత బరువులో ఉండడం లేదు. జిల్లాలో 32 గురుకులాలు, కేజీబీవీలు ఉన్నాయి. ఇందులో 11వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. గురుకులాలకు సరఫరా చేసే కాంట్రాక్టర్​ నిబంధనల ప్రకారం ఒక్కో గుడ్డు 50 గ్రాములు ఉండేలా చూసుకోవాలి. 

కానీ, ఒక్క ట్రే గుడ్లలో ఐదారు గుడ్లు 50 గ్రాములవి ఉంటుండగా, మిగిలినవి 40 గ్రాములే ఉంటున్నాయి. గురుకులాల విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనాన్ని అందించాలన్న లక్ష్యంతో కోడిగుడ్లను ఇస్తుండగా, క్షేత్రస్థాయిలో మాత్రం తక్కువ బరువున్న గుడ్లు సరఫరా అవుతుండడంతో లక్ష్యం నీరుగారిపోతోంది.

తగ్గిన గుడ్ల ఉత్పత్తి..

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో కోడిగుడ్ల ధరలు పెరిగాయి. ఉమ్మడి జిల్లాలో ప్రతి రోజూ 60 లక్షల గుడ్లు ఉత్పత్తి అయితే, ప్రస్తుతం 38 లక్షల గుడ్లే ఉత్పత్తి అవుతున్నాయని పౌల్ట్రీ ఫారమ్స్​ నిర్వాహకులు చెబుతున్నారు. ఉత్పత్తి తగ్గి డిమాండ్​ ఎక్కువగా ఉండడంతో గుడ్ల ధరలు పెరిగాయని వారు అంటున్నారు. మరో నెల రోజుల పాటు గుడ్ల రేటు ఇలాగే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.