రూ. 5 లక్షల కోట్లు రావాల్సిన భూములను రూ.5 వేల కోట్లకు ఇచ్చారు: హరీశ్ రావు

రూ. 5 లక్షల కోట్లు రావాల్సిన భూములను  రూ.5 వేల కోట్లకు ఇచ్చారు: హరీశ్ రావు

 కాంగ్రెస్ సర్కార్ పెద్ద భూ కుంభకోణానికి తెరలేపిందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు.  పరిశ్రమల భూములను మల్టీ పర్పస్ కింద ఎలా వాడతారని ప్రశ్నించారు. గ్రీన్ ఇండస్ట్రీలను సర్కారే బయటకు పంపుతోందన్నారు.  5 లక్షల కోట్లు రావాల్సిన భూములను 5 వేల కోట్లకు ఇచ్చారని  తెలిపారు. లక్షల కోట్ల విలువైన భూములను ఆగమేఘాల మీద అప్పగించారని తెలిపారు.  

9 వేల 290 ఎకరాల భూములతో కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు హరీశ్. కేబినెట్, అసెంబ్లీలో చర్చించకుండా నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు . రెండు సంవత్సరాల బడ్జెట్ కు సరిపడా నిధులు వచ్చే నిర్ణయాన్ని ఏకపక్షంగా నిర్ణయించారని అన్నారు. భారీ భూ కుంభకోణంపై బీజేపీ ఎందుకు స్పందిండచం లేదని ప్రశ్నించారు హరీశ్. 

దేశచరిత్రలోనే అతి పెద్ద ల్యాండ్ స్కామ్: కేటీఆర్

కాంగ్రెస్​ ప్రభుత్వం తెస్తున్న హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్​ఫర్మేషన్ పాలసీ (హెచ్ఐఎల్​టీపీ) వెనుక రూ. 5 లక్షల కోట్ల భూ కుంభకోణం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  ఆరోపించిన సంగతి తెలిసిందే ‘‘ఈ వ్యవహారంలో రూ.50 వేల కోట్లను సీఎం రేవంత్ తన జేబులో వేసుకోవాలని చూస్తున్నరు. ఈ స్కామ్ దేశచరిత్రలోనే అతి పెద్ద ల్యాండ్ స్కామ్. సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉండే రాజకీయ మధ్యవర్తులు, బంధువులు, రియల్ ఎస్టేట్ గ్రూపులకు లబ్ధి చేకూర్చేందుకే ఈ పాలసీని తెచ్చారు. చాలా తక్కువ ధరకే వేలాది ఎకరాల భూములను మల్టీ యూజ్​లో భాగంగా రియల్​ఎస్టేట్​గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని ఆయన దుయ్యబట్టారు.