
- ఆ ప్రాజెక్టు కింద నిరుడు కూడా లక్షల ఎకరాల్లో పంటలు పండినయ్: హరీశ్‌రావు
- కేసీఆర్.. వందేండ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కాళేశ్వరం కట్టారు
- ఆయన చరిత్ర పుటల్లో, ప్రజల గుండెల్లో దేవుడిలా నిలిచిపోతరు
- రైతులకు నీళ్లివ్వాలని కేసీఆర్ రాత్రింబవళ్లూ కష్టపడి ప్రాజెక్టు కడ్తే.. సొంత నిర్ణయమంటరా?
- ప్రాజెక్టుకు కేబినెట్, అసెంబ్లీతో పాటు 11 కేంద్ర సంస్థల అనుమతులు ఉన్నయ్
- కమిషన్ రిపోర్టు ఒక ట్రాష్ అని వ్యాఖ్య.. కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి గుండెకాయ అని, అది ముమ్మాటికీ వరప్రదాయిని అని బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కాళేశ్వరం కుప్పకూలిందంటూ కాంగ్రెస్ నేతలు బోగస్ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆ ప్రాజెక్టు కింద నిరుడు కూడా లక్షల ఎకరాల్లో పంటలు పండాయని చెప్పారు. బస్వాపూర్ కింద నల్గొండ జిల్లాలో, కొండపోచమ్మ సాగర్ కింద మెదక్ జిల్లా, మల్లన్నసాగర్‌తో సిద్దిపేట, సిరిసిల్ల, అన్నపూర్ణ కింద కరీంనగర్ జిల్లాల్లో పంటలు పండాయని తెలిపారు.
‘‘కాళేశ్వరం అంటే సింగిల్ ప్రాజెక్ట్ కాదు.. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్‌హౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వలు, 98 కిలోమీటర్ల ప్రెజర్మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజీ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్టింగ్, 240 టీఎంసీల నీటి వినియోగం. వీటిలో 15 రిజర్వాయర్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆ రిజర్వాయర్ల కింద నీళ్లు పారుతున్నాయో లేదో.. పంటలు పండుతున్నాయో లేదో.. కట్టల మీదకు వెళ్లి చూద్దాం పదండి” అని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. కాళేశ్వరంలోని అన్ని కాంపొనెంట్లు సేఫ్‌గా ఉన్నాయని పేర్కొన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక నేపథ్యంలో మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆ ప్రాజెక్ట్‌పై హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కాళేశ్వరం మూడు బ్యారేజీల్లోని ఒక బ్యారేజీలో రెండు పిల్లర్లే కుంగాయి. అలాంటప్పుడు కాళేశ్వరం మొత్తం కూలిందని ఎట్లా చెప్తారు? కుంగిన పిల్లర్లను బాగు చేసి నీళ్లు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత కాదా? ఎంతసేపటికీ కేసీఆర్‌పై ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవడం తప్ప.. ప్రభుత్వం చేసిందేముంది? కాంగ్రెస్నేతలది రాజకీయ పబ్బం గడుపుకోవాలన్న ఆత్రుతే తప్ప ఇంకేం లేదు” అని ఫైర్ అయ్యారు. కానీ కేసీఆర్‌ది మాత్రం రైతులకు నీళ్లివ్వాలన్న తపన, తన్లాట, ఆర్తి అని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీని బాగు చేస్తే ప్రభుత్వానికే గౌరవం ఉంటుందని.. లేదంటే మళ్లీ మూడేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది తామేనని, అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రిపేర్లు చేసి నీళ్లిస్తామని అన్నారు. ‘‘గతంలో సర్ఆర్థర్ కాటన్ బ్యారేజీ కట్టినా కమిషన్లు వేసి వేధించారు. ఆయన్ను 900 ప్రశ్నలు వేశారు. అయినా సర్ ఆర్థర్ కాటన్గోదావరి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. కాళేశ్వరం కట్టిన కేసీఆర్‌కూడా చరిత్ర పుటల్లో, ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిపోతారు” అని అన్నారు.
కేసీఆర్‌ను హింసించాలనే విచారణ..
వందేళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేసీఆర్కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని హరీశ్‌రావు తెలిపారు. ‘‘దేశంలో ఎన్నో కమిషన్లు వేశారు. అవేవీ కోర్టుల ముందు నిలబడవు. గతంలోనూ ఎంతో మంది రాజకీయ నాయకులపై కమిషన్లు వేశారు. ఇప్పుడు కేసీఆర్‌ను హింసించాలన్న ఉద్దేశంతోనే సీఎం రేవంత్వరుస సీరియళ్లు నడిపిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్విచారణ కుట్రపూరితంగా జరిగిందన్న అనుమానం ఉంది. మొత్తం 665 పేజీల్లో నివేదిక ఉండగా.. అందులో నచ్చిన అంశాలను, నచ్చని వ్యక్తులపై ఇచ్చిన వివరాలను మాత్రమే 60 పేజీల రూపంలో బయటకు తీసుకొచ్చారు. అసెంబ్లీలో ప్రభుత్వం పూర్తి నివేదికను పెడితే నిలదీస్తాం. కేబినెట్‌లో పెట్టిన నివేదికను చూస్తే.. ఒకవైపే చూసి, ఒకవైపే విని, ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్లాగా కనిపిస్తున్నది. ఆ రిపోర్ట్ ఒక ట్రాష్.. నిరాధారమైనది’’ అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ సొంత నిర్ణయమని ఎలా చెబుతారని ప్రశ్నించారు. దానికి కేబినెట్, అసెంబ్లీతో పాటు 11 కేంద్ర సంస్థల అనుమతులు ఉన్నాయని చెప్పారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కేసీఆర్రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ప్రజల కోసం రివ్యూలు చేయకపోతే తప్పుగానీ.. చేస్తే తప్పు ఎందుకు అవుతుంది. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వలేదు. కానీ కేసీఆర్ ప్రాజెక్టులపై అసెంబ్లీలోనే చర్చ పెట్టారు. అప్పుడు ప్రిపేర్అయి రాలేదంటూ ఉత్తమ్పారిపోయిండు” అని ఎద్దేవా చేశారు. ప్రాణహితకు జాతీయహోదా ఇవ్వాలని పేర్కొంటూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చుపై ప్రధానికి కేసీఆర్ లేఖ రాశారని చెప్పారు.
ప్రాణహిత-చేవెళ్ల ఖర్చు 3,700 కోట్లే..
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందన్న సీఎం రేవంత్.. ఆ ప్రాజెక్టులో భాగమైన గంధమల్లకు కొబ్బరికాయ ఎలా కొట్టారని హరీశ్‌రావు ప్రశ్నించారు. మల్లన్నసాగర్ నుంచి మూసీకి నీళ్లు తీసుకొస్తానని ఎలా చెబుతారని నిలదీశారు. సత్యహరిశ్చంద్రుడికి తమ్ముడిలాగా ఉత్తమ్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘‘ప్రాణహిత–-చేవెళ్ల ప్రాజెక్టులో పెట్టిన ఖర్చు రూ.3,700 కోట్లు మాత్రమే.. కానీ రూ.11 వేల కోట్లు ఖర్చు చేశామని ఉత్తమ్ చెబుతున్నారు. ఆనాడు మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట రూ. 2 వేల కోట్లు దోచుకున్నారు. కమిషన్‌నుంచి మాకు నోటీసులు రాకముందే.. మమ్మల్ని విచారణకు పిలుస్తారంటూ మీడియాకు లీకులిచ్చారు.
రిపోర్టు రెడీ అయిందనుకున్నాక.. రాత్రికి రాత్రే మమ్మల్ని విచారణకు పిలిచేంతగా ఏం జరిగింది?’’ అని ప్రశ్నించారు. తుమ్మిడిహెట్టి నిజంగానే కట్టాలనుకుంటే కాంగ్రెస్హయాంలో తట్టెడు మట్టి కూడా ఎందుకు ఎత్తలేదని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అయినా ఎందుకు అక్కడ మట్టి తీయలేదని ప్రశ్నించారు. ‘‘తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ నిర్మించేందుకు మహారాష్ట్రతో కేసీఆర్చారిత్రక ఒప్పందం చేసుకున్నారు. 152 మీటర్లకు అగ్రిమెంట్చేస్తే 148 మీటర్లకు ఎలా తగ్గిస్తారని ఉత్తమ్ ప్రశ్నిస్తున్నారు. కానీ 152 మీటర్లకు ఒప్పందం జరిగినట్టు అగ్రిమెంట్పేపర్ తీసుకొస్తే రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా చేస్తానంటూ ఇంతకుముందే కేసీఆర్సవాల్విసిరారు” అని పేర్కొన్నారు.
కమిటీ చెబితేనే లొకేషన్ మేడిగడ్డకు మార్చినం..
ఎక్స్‌పర్ట్ కమిటీ సూచనల మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు లొకేషన్‌ను మేడిగడ్డకు మార్చామని హరీశ్ రావు తెలిపారు. ‘‘తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత లేదని సెంట్రల్వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ) చెప్పింది. 165 టీఎంసీల నీటి లభ్యతపై మరోసారి స్టడీ చేయాలంటూ అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి కూడా లేఖ రాశారు. లొకేషన్ తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చాలని తీసుకున్న నిర్ణయం మాది కాదు.. రిటైర్డ్ఇంజనీర్లతో వేసిన ఎక్స్‌పర్ట్ కమిటీ సూచించింది. మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరుకు నేరుగా నీటిని తరలించలేమని మాత్రమే ఎక్స్‌పర్ట్ కమిటీ చెప్పింది. ఈ విషయాన్ని నిపుణుల కమిటీ కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లోనే పేర్కొన్నది” అని వివరించారు.
పోలవరం కూలితే ఎన్డీఎస్‌ఏ ఎందుకు పోలేదు?
మేడిగడ్డ బ్యారేజీ కుంగగానే ప్రభుత్వం పిలవకపోయినా నేషనల్డ్యామ్సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఆగమేఘాల మీద ఇక్కడికి వచ్చిందని హరీశ్‌రావు అన్నారు. మరి గోదావరి నదిపైనే నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు మూడుసార్లు కుప్పకూలినా అక్కడికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏకి దేశమంతా ఒకే నీతి ఉంటుందా? లేక రాష్ట్రానికో నీతి ఉంటుందా? అని నిలదీశారు. పోలవరం కూలిన ఘటనలో ప్రధానిని బాధ్యులను చేస్తారా? అని ప్రశ్నించారు. రాజకీయ కుట్రతోనే కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందని ఆరోపించారు. ‘‘బ్యారేజీలో రెండు పిల్లర్లు కూలితేనే కేసీఆర్ బాధ్యడు అంటున్నారు. మరి ఎస్ఎల్బీసీ కుప్పకూలిన ఘటనలో ఇప్పటికీ మృతదేహాలు బయటకు రాలేదు. ఈ ఘటనలో సీఎం రేవంత్, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కూడా బాధ్యులే” అని అన్నారు.