అబద్ధాలు ప్రచారం చేస్తే..నిజాలు మరుగున పడిపోవు : హరీశ్రావు

అబద్ధాలు ప్రచారం చేస్తే..నిజాలు మరుగున పడిపోవు : హరీశ్రావు
  • కేసీఆర్ సంక్షేమ ఫలాలను ప్రజలు మర్చిపోరు: హరీశ్​రావు

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్​ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేసినంత మాత్రాన నిజాలు మరుగున పడిపోవని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు అన్నారు. కేసీఆర్ ​అందించిన సంక్షేమ ఫలాలను ప్రజలు మర్చిపోరని పేర్కొన్నారు. రెండేండ్లుగా కేసీఆర్ ​మీద, బీఆర్​ఎస్ మీద పడి ఏడ్వడం తప్ప సీఎం రేవంత్​ చేసిందేందని ఆయన ప్రశ్నించారు. విజయోత్సవాలంటూ విచ్చలవిడిగా తిరుగుతూ.. వికృతంగా మాట్లాడినంత మాత్రాన చేయనివి చేసినట్టుగా మారిపోవన్నారు. మాజీ సీఎం కేసీఆర్​పై దేవరకొండ సభలో సీఎం రేవంత్​ చేసిన వ్యాఖ్యలకు శనివారం హరీశ్​ రావు కౌంటర్​ ఇచ్చారు. ‘‘బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు  కూడా ఇవ్వలేదని అబద్దం చెబుతున్నరు.

 మా హయాంలో 6,47,479 రేషన్ కార్డులు మంజూరు చేసింది అబద్ధమా? గతంలో కార్డు మీద 4 కేజీల బియ్యం మాత్రమే ఇస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని 6 కేజీలకు పెంచి, కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఇచ్చింది అబద్దమా? నల్గొండ ప్రజల మీద కక్ష కట్టింది ఎవరు? ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నెవర్ ఎండింగ్ ప్రాజెక్టుగా డిజైన్ చేసింది ఎవరు? ప్రాజెక్టును పడావు పెట్టింది ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ. 3,892 కోట్లు ఖర్చు చేసి.. 11.48 కి.మీ సొరంగం పనులు పూర్తి చేసింది నిజం కాదా? అనాలోచిత నిర్ణయాలు, దుందుడుకు చర్యలతో ఎస్ ఎల్ బీసీని త్రిశంకు స్వర్గంలో పడేసింది మీరు కాదా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, ఎలాంటి స్టడీ నిర్వహించకుండా 8 మంది అమాయకుల ప్రాణాలను బలి కొన్నది మీరు కాదా? రెండేండ్లలో కొత్తగా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వకుండా ఇరిగేషన్ గురించి మాట్లాడితే ప్రజలకు ఇరిటేషన్ కలుగుతున్నది. 

అక్రమంగా కృష్ణా నీళ్లను ఏపీ తరలించుకుపోతుంటే, అక్రమ ప్రాజెక్టులకు డీపీఆర్ లు తయారు చేస్తుంటే అడ్డుకోలేని రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ మీద పడి ఏడుస్తున్నడు. ఆటలాడటంపై ఉన్న శ్రద్ధ.. ప్రజా సమస్యల మీద, పరిపాలన మీద లేకపోవడం సిగ్గుచేటు. నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివా లేక ప్రపంచ ఆటగాడివా?’’ అని హరీశ్​రావు మండిపడ్డారు.