నిరుద్యోగులపై కాంగ్రెస్‌‌‌‌ది కపట ప్రేమ: హరీశ్‌‌‌‌ రావు

నిరుద్యోగులపై కాంగ్రెస్‌‌‌‌ది కపట ప్రేమ: హరీశ్‌‌‌‌ రావు

పద్మారావునగర్, వెలుగు: ఎన్నికల్లో నిరుద్యోగులకు ఎన్నో హామీలను ఇచ్చి, గెలిచాక వాటిని మర్చిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదని మాజీ మంత్రి హరీశ్‌‌‌‌ రావు అన్నారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, గ్రూప్‌‌‌‌ 1 మెయిన్స్‌‌‌‌కు ఎలిజిబిలిటీ పెంచాలని డిమాండ్ చేస్తూ వారం రోజుల నుంచి విద్యార్థి నాయకుడు మోతీలాల్‌‌‌‌ నాయక్‌‌‌‌ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం దారుణమని మండిపడ్డారు. గాంధీ ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న మోతీలాల్ నాయక్‌‌‌‌ను హరీశ్‌‌‌‌ రావు ఆదివారం పరామర్శించారు. 

అనంతరం గాంధీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. మోతీలాల్ నాయక్ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గాంధీకి వచ్చి ఆయనతో మాట్లాడాలన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనని, లేకపోతే బీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా దీక్షను విరమించాలని మోతీలాల్ నాయక్‌‌‌‌ను కోరామన్నారు. మోతీలాల్‌‌‌‌కు ఏదైనా హానీ జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల ముందు అశోక్ నగర్‌‌‌‌‌‌‌‌లో కోచింగ్ సెంటర్ల వద్దకు వెళ్లి నిరుద్యోగులపై కపట ప్రేమ నటించిన కాంగ్రెస్‌‌‌‌ ఎంపీ రాహుల్‌‌‌‌ గాంధీ.. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. 

అయినా ఇప్పటివరకు నోటిఫికేషన్ల జాడ లేదన్నారు. నిరుద్యోగుల కోసం కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ, బస్సు యాత్రలు చేసిన ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ కోదండరాం, రియాజ్, బల్మూరి వెంకట్, మురళి గొంతులు ఇప్పుడు ఎందుకు మూగబోయాయని ప్రశ్నించారు. ఎన్నికల టైమ్‌‌‌‌లో చెప్పినట్టుగా గ్రూప్1 మెయిన్స్‌‌‌‌కు 1:50 కాకుండా 1:100 రేషియాలో అభ్యర్థులను  పిలవాలని కోరారు. మెగా డీఎస్సీని 11 వేల పోస్టులతో కాదు.. 25 వేల టీచర్ పోస్టులతో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట ఉప్పల్ ఎమ్మెల్యే బి.లక్ష్మారెడ్డి, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నాయకులు దేశపతి శ్రీనివాస్, గెల్లు శ్రీనివాస్, ఎర్రోళ్ల శ్రీనివాస్, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, ఓయూ నిరుద్యోగ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.