- రెండేండ్లు లోటు బడ్జెట్ పెట్టి
- ఇప్పుడు రూ. 3.24 లక్షల కోట్లకు
- ఎలా పెంచుతరు?
- ఏయే స్కీమ్‌లను రద్దు చేస్తారో
- ప్రజలకు చెప్పాలని డిమాండ్
- ఎక్సైజ్‌లో ఉన్నట్టుండి రూ.12 వేల కోట్ల ఆదాయం ఎలా పెరుగుతదని ప్రశ్న
- హరీశ్‌కు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రుల కౌంటర్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్ ‘అన్ రియలిస్టిక్’గా ఉందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమర్శించారు. మొదటి బడ్జెట్లో రూ.59 వేల కోట్లు, రెండో బడ్జెట్లో రూ.54 వేల కోట్ల లోటు ఉందని.. కానీ, ఈ సారి బడ్జెట్‌ను మరింత పెంచి 3.24 లక్షల కోట్లకు ఎట్లా పెంచుతారని ప్రశ్నించారు. ఎవరిని మోసం చేయడానికి ఈ లెక్కలు చెప్పారని, ఏయే స్కీమ్‌ను రద్దు చేయబోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఎక్సైజ్ శాఖలో ఉన్నట్టుండి రూ.12 వేల కోట్ల ఆదాయం ఎలా పెరుగుతది? రాష్ట్రా న్ని తాగుబోతుల తెలంగాణగా మారుస్తరా?’ అని నిల దీశారు. సోమవారం మధ్యాహ్నం శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా.. బడ్జెట్ అంచనాలు, పలు శాఖలకు కేటాయింపుల తీరుపై హరీశ్ రావు పలు ప్రశ్నలు లేవనెత్తారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు సమాధానమిచ్చారు. సుమారు 2 గంటలకు పైగా వీరి మధ్య వాడీవేడి చర్చ జరిగింది.
రైతు బంధు ఆపి రుణమాఫీ చేశారు..
గత రెండున్నరేండ్లలో రూ.19 వేల కోట్లకు పైగా రైతు బంధు నిలిపివేసి అవే డబ్బులతో పంట రుణ మాఫీ చేశారని హరీశ్‌రావు ఆరోపించారు. కేవలం రూ.20,157 కోట్లు మాత్రమే రుణ మాఫీ చేసి, బడ్జెట్పుస్తకాల్లో రూ.31 వేల కోట్లు అని ఒకసారి, రూ.20,616 కోట్లు అని రెండో సారి రాసి మోసం చేశా రన్నారు. ‘సిద్దిపేటలోనే 2 లక్షలలోపు రుణమాఫీ కాని రైతులు 10,217 మంది ఉన్నరు. 2 లక్షల పైన ఉండి మాఫీ కాని రైతులు 12,632 మంది ఉన్నరు. ఈ నియోజకవర్గంలో మొత్తం 43,363 మంది రైతులు ఉండగా, 52 శాతం మందికి ఇంకా రుణమాఫీ కాలేదు’ అని హరీశ్ ఆరోపించారు. ‘నేను చాలెంజ్ చేస్తున్నా.. సీఎం నియోజకవర్గం కొడంగల్, డిప్యూటీ సీఎం నియోజకవర్గం మధిరకు పోదాం. అక్కడే రైతులను అడుగుదాం. ఎందరికి రుణమాఫీ అయిందో తేలిపోద్ది’ అంటూ సవాల్ విసిరారు. కరోనా కాలంలో కూడా కేసీఆర్ రైతు బంధు ఆపలేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా 15 వేలకు ఎప్పుడు పెంచుతారో సభలో ప్రకటించాలని డిమాండ్ చేశారు.
తాగుబోతుల తెలంగాణ చేస్తరా?
‘గతేడాది ఎక్సైజ్ ఆదాయం రూ.34,603 కోట్లు ఉంటే ఈ ఏడాది బడ్జెట్లో ఏకంగా రూ.46,941 కోట్లుగా చూపించారు. ఒకే ఏడాదిలో రూ.12,338 కోట్లు ఎట్ల పెరుగుతుంది? 35.65 శాతం గ్రోత్ సాధ్యమవుతుందా?’ అని హరీశ్ ప్రశ్నించారు. కనీసం మరో 25 వేల కోట్ల లిక్కర్ సేల్స్ పెరిగితే తప్ప ఈ టార్గెట్ సాధ్యం కాదని, ఈ గ్రోత్ కోసం రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చుతారా.. అని ప్రశ్నించారు. సాదా బైనామా రెండో విడతలో 9 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకుంటే ఈ ప్రభుత్వం కేవలం 172 మందికే ఆమోదం తెలిపిందన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరో సా, రాజీవ్‌యువ వికాసం పథకాలు ఎక్కడికి పోయాయన్నారు. రెండు లక్షల ఉద్యోగాలతో జాబ్‌క్యాలెండర్ ఏమైందని హరీశ్‌రావు ప్రశ్నించారు.
రెండుసార్లు లోటు బడ్జెట్లే
గత రెండేండ్లలో 12 ప్రాజెక్టులను పూర్తి చేసి కొత్తగా ఇస్తామన్న 11.60 లక్షల ఆయకట్టు ఎక్కడ అని హరీశ్ నిలదీశారు. రెండున్నరేండ్లలో కొత్తగా ఒక్క ఎకరానికీ నీళ్లియ్యని సర్కారు ఇదేనన్నారు. 2024–25 బడ్జెట్ రూ.2.90 లక్షల కోట్లు, రివైజ్డ్ బడ్జెట్లో రూ.2.66 లక్షల కోట్లు చూపగా, చివరికి రూ.2.31 కోట్లకు చేరిందని, 20 శాతం లోటుతో రూ.59 వేల కోట్ల లోటు ఏర్పడిందన్నారు. రివైజ్డ్ అంచనాలకు, వాస్తవాలకు మధ్య తేడా 35,025 కోట్లు, అంటే 13.13 శాతం వ్యత్యాసం వచ్చిందన్నారు. 20శాతం లోటు ఉంటే దీన్ని రియలిస్టిక్ బడ్జెట్ అంటారా? అని ప్రశ్నించారు. 2025–26లో కూడా 18 శాతం డెఫిసిట్‌తో 54 వేల కోట్ల లోటు ఏర్పడిందని పేర్కొన్నారు. ఇక 2026–27లో 3,24,134 కోట్ల బడ్జెట్ పెట్టారని, గత వాస్తవాల కంటే ఇది 74 వేల కోట్లు ఎక్కువ అని చెప్పారు. ప్రభుత్వం చెప్పినట్లు 10.7 శాతం గ్రోత్ ఉంటుందని అనుకున్నా 2.75 లక్షల నుంచి 2.80 లక్షల కోట్ల మధ్య రావడమే కష్టమని హరీశ్‌రావు అన్నారు.
రిజిస్ట్రేషన్ల ఆదాయం పడిపోయింది
తెలంగాణ ఏర్పడిన కొత్తలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 2,177 కోట్లు కాగా, కేసీఆర్ విజన్ కారణంగా 2023-24 నాటికి ఏకంగా రూ. 14,296 కోట్లకు చేరిందని హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 42.5 శాతంతో అద్భుతమైన వృద్ధి రేటు నమోదు చేశామని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే 2024-25 లో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఏకంగా మైనస్ 42 శాతానికి పడిపోయి, కేవలం
రూ. 8,473 కోట్లు వచ్చిందన్నారు. ఈ ఏడాది జనవరిలో కాగ్ రిపోర్టు ప్రకారం అతి కష్టం మీద రూ.12వేల కోట్లకు చేరుకున్నదని వెల్లడించారు.
