సిగాచి, ఎస్ఎల్బీసీ ఘటనలపై ప్రభుత్వానిది బాధ్యతారాహిత్యం : హరీశ్రావు

సిగాచి, ఎస్ఎల్బీసీ ఘటనలపై ప్రభుత్వానిది బాధ్యతారాహిత్యం : హరీశ్రావు
  • ఆ 14 మంది డెడ్​బాడీల జాడ ఎక్కడ?: 
  • సంగారెడ్డిలో సిగాచి బాధిత కుటుంబాలతో కలిసి బీఆర్ఎస్ నిరసన

సంగారెడ్డి, వెలుగు: సిగాచి, ఎస్ఎల్ బీసీ ఘటనలపై ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ప్రభుత్వ అసమర్థతపై మాట్లాడినా.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా జైళ్లలో పెడతారని.. మరి 54 మంది ప్రాణాలు బలితీసుకున్న సిగాచి కంపెనీపై కేసు ఎందుకు పెట్టరని ఆయన ప్రశ్నించారు. సిగాచి ఫ్యాక్టరీ ప్రమాద బాధితుల పక్షాన సోమవారం సంగారెడ్డిలో బీఆర్ఎస్ నిరసన ప్రదర్శన చేపట్టింది. ఇందులో మంత్రి హరీశ్ రావు పాల్గొని బాధిత కుటుంబ సభ్యులతో కలిసి సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సీఎం ప్రకటించిన రూ.కోటి పరిహారం ఇంకా ఎవరికీ ఇవ్వలేదు. 

46 మంది చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. ఆచూకీ దొరకని 8 మందికి కూడా డెత్ డిక్లరేషన్ ఇచ్చి పరిహారం అందించాలి”అని ఆయన డిమాండ్ చేశారు. ఎస్ఎల్ బీసీ ఘటన జరిగితే హెలికాప్టర్లు వేసుకొని వెళ్లారే తప్ప.. డెడ్ బాడీలను బయటకు తీసుకురాలేదని మండిపడ్డారు. సిగాచీలో 8 మంది, ఎస్ఎల్ బీసీలో ఆరుగురు మొత్తం 14 మంది శవాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. సిగాచి కంపెనీ బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కోటి పరిహారం ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

 ఇవ్వకుంటే బాధిత కుటుంబాలతో కలిసి టెంట్ వేసి కూర్చుంటామని, పరిహారం అందేదాక టెంట్ తీయమని అన్నారు. ఇంకా చాలా మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 లక్షలు ఇచ్చి నెల నెల వేతనం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే బీఆర్ఎస్ తరఫున పోరాటం తీవ్రతరం చేస్తామని హరీశ్ రావు హెచ్చరించారు. మీడియా సమావేశంలో సంగారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతారెడ్డి, కార్పొరేటర్ సింధురెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, డీసీఎంఎస్ ఉమ్మడి జిల్లా చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.