బోనస్ ఇచ్చే వరకు అసెంబ్లీని నడవనియ్యం: హరీశ్ రావు

బోనస్ ఇచ్చే వరకు అసెంబ్లీని నడవనియ్యం: హరీశ్ రావు
  • సమావేశాల్లో అర్జెంట్ బిల్లు ప్రవేశపెడ్తం
  • కాంగ్రెసోళ్లు  రైతుల గుండెల మీద తన్నిండ్రు
  • మాజీమంత్రి హరీశ్​ రావు

 
కొండగట్టు,కొడిమ్యాల/జగిత్యాల:  అన్ని రకాల వడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చే వరకు అసెంబ్లీని నడవనిచ్చే ప్రసక్తే లేదని మాజీమంత్రి హరీశ్​ రావు  తేల్చి చెప్పారు. ఇవాళ  కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. గత ఎన్నికల్లో తన గెలుపు కోసం కట్టిన ముడుపును విప్పి స్వామివారికి చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొడిమ్యాల మండలం పూడూరు ఫ్యాక్స్ సెంటర్ లో తడిసిన వడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  జూలైలో జరిగే అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున  బోనస్​పై అర్జెంట్ బిల్లు ప్రవేశపెడతామన్నారు.  రూ.500 బోనస్ ఇవ్వాలని మొదటి రోజునే అసెంబ్లీలో తాము పోరాడుతామన్నారు. 

రైతులు అసెంబ్లీ బయట పోరాడాలని ఆయన సూచించారు.  వరికి  బోనస్ అడిగితే ప్రతిపక్ష నాయకులను, రైతులను కుక్కలతో పోలుస్తున్నాడని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో రైతుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేబినెట్ మీటింగ్ లో రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల్లోనే వడ్లన్నింటినీ కొంటామని చెప్పినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు.  వడ్లు మొలకెత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.  గత్యంతరం లేక తక్కువ ధరకే దళారులకు పంట నమ్ముకునే పరిస్థితి నెలకొందన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను గుండెల మీద తన్నారని ఆయన మండిపడ్డారు.  దొడ్డు రకం వడ్లకు కూడా రూ.500 బోనస్ ఇవ్వాలని  డిమాండ్ చేశారు.