6న అసెంబ్లీలో బడ్జెట్‌‌ ప్రవేశపెట్టనున్న హరీశ్​రావు

6న అసెంబ్లీలో బడ్జెట్‌‌ ప్రవేశపెట్టనున్న హరీశ్​రావు
  • 3న ఉభయ సభలనుద్దేశించి తమిళిసై ప్రసంగం
  • గత సమావేశాలకు కొనసాగింపుగానే సెషన్
  • గవర్నర్​ అనుమతితో నోటిఫికేషన్‌‌ జారీ

హైదరాబాద్‌‌, వెలుగు: గత సెషన్‌‌కు కొనసాగింపుగానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణ రెండో అసెంబ్లీ ఎనిమిదో సెషన్‌‌ నాలుగో మీటింగ్‌‌ ఈ నెల 3న మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రారంభమవుతుందని ప్రభుత్వం నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. గవర్నర్​ అనుమతితో అసెంబ్లీ సెక్రటరీ మంగళవారం నోటిఫికేషన్​ ఇచ్చారు. కౌన్సిల్‌ 18వ సెషన్‌ నాలుగో మీటింగ్‌ కూడా అదే సమయానికి అసెంబ్లీ హాల్‌లో ప్రారంభమవుతుందని మరో నోటిఫికేషన్‌లో వెల్లడించారు. సమావేశాల తొలిరోజే ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగించనున్నారు. అనంతరం అసెంబ్లీ, కౌన్సిల్‌ బీఏసీ సమావేశాలు నిర్వహించి.. సెషన్‌ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 6న అసెంబ్లీ, కౌన్సిల్‌లో 2023–24 వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. మంగళవారమే రాష్ట్ర బడ్జెట్‌కు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి కూడా ఆమోదముద్ర వేశారు.

సాంకేతిక కారణాలతోనే..

ఉభయ సభలను ప్రొరోగ్‌ చేసి గవర్నర్ అనుమతితో అసెంబ్లీ, కౌన్సిల్‌ను సమావేశపరుస్తూ కొత్తగా నోటిఫికేషన్‌ ఇస్తారని సోమవారం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దానికి భిన్నంగా గత సెషన్‌కు కొనసాగింపుగానే సమావేశాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీని ప్రొరోగ్‌ చేసి మళ్లీ సమావేశపరచడానికి వ్యవధి ఉండాలనే సాంకేతిక కారణాలతోనే గత సమావేశాలకు కొనసాగింపుగా సమావేశాలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 3న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ చేసే ప్రసంగంపై ధన్యవాదాలు తెలుపుతూ 4న అసెంబ్లీ, మండలిలో వేర్వేరుగా తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించనున్నారు. 6న ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, మండలిలో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి బడ్జెట్‌ ప్రవేశపెడతారు. 7న బడ్జెట్‌ అధ్యయనం చేయడానికి సెలవు ఇస్తారు. 8వ తేదీ నుంచి ఐదు రోజులపాటు అసెంబ్లీ నిర్వహించి అప్రాప్రియేషన్‌ బిల్లుకు ఆమోదంతో ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేయనున్నారు. ఈ సెషన్‌లో కాగ్‌ రిపోర్టును ప్రవేశపెట్టనున్నారు. మండలి డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక కూడా నిర్వహించే అవకాశముందని సమాచారం.