మాంసంతో జాగ్రత్త

మాంసంతో జాగ్రత్త

నాన్‌‌‌‌వెజ్ తినేందుకు చాలారకాల ఆప్షన్స్ ఉన్నాయ్. చికెన్, మటన్, ఫిష్ ఇలా బోలెడు. అయితే వీటన్నింటిని రెడ్ మీట్, వైట్ మీట్ అని రెండు రకాలుగా డివైడ్ చేశారు.  రెడ్ మీట్ అంటే బీఫ్‌‌‌‌, మటన్, పోర్క్  లాంటివి.  వైట్ మీట్ అంటే చేపలు, కోడి, రొయ్యలు, ఎండ్రకాయలు (పీతలు), పక్షుల లాంటివి.

రెండిటిలోనూ…

చికెన్‌‌‌‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. మటన్‌‌‌‌లో ప్రొటీన్‌‌‌‌తో పాటు ఫ్యాట్స్ కూడా ఉంటాయి.  కొవ్వు తినకూడదు, కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనుకునే వాళ్లు మటన్‌‌‌‌కి బదులు చికెన్‌‌‌‌ను ఎంచుకుంటారు. అయితే కొలెస్ట్రాల్‌‌‌‌తో సంబంధం లేని వాళ్లు మాత్రం మటన్‌‌‌‌ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక ఈ రెండూ ఆరోగ్యానికి అంత మంచివికావనుకునే వాళ్లు చేపలు, రొయ్యలు తింటుంటారు. అసలు ఈ మూడిట్లో ఏది మంచిది. ఏది చెడు కొలెస్ట్రాల్‌‌‌‌ను పెంచుతుంది అని తెలుసుకునేందుకు ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ సంస్థ’ ఇటీవల ఓ రీసెర్చ్ చేసింది. ఇప్పటి వరకు కొలెస్ట్రాల్‌‌‌‌ను  పెంచే మాంసాహారం రెడ్ మీట్ ఒక్కటే అనుకునే వాళ్లు..  కానీ ఈ రీసెర్చ్ ఆ ఆలోచనని  పూర్తిగా మార్చేసింది. రెడ్ మీట్, వైట్ మీట్ రెండూ కార్డియోవాస్క్యులర్ జబ్బులకు కారణమవుతాయని తేల్చింది.  మాంసం ఏదైనా కొలెస్ట్రాల్ మీద ఒకే రకమైన ప్రభావాన్ని చూపుతుందట.

గుండెకు చేటు…

నిత్యం మనం తినే వాటి వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని అందరికీ తెలిసిందే. అందులో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌‌‌‌డీఎల్), మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌‌‌‌డీఎల్) అని రెండు ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ మన శరీరానికి మేలు చేస్తే, చెడు కొలెస్ట్రాల్ మాత్రం మనకు చేటు చేస్తుంది. పలు అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. బరువు కూడా పెరుగుతారు. అయితే ఈ రకమైన ‘లో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్’  అన్నిరకాల మాంసం, మాంసం ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉంటాయని ఈ రీసెర్చ్ బయట పెట్టింది. ఇక తక్కువ ఎల్‌‌‌‌డీఏ ఫుడ్ విషయానికొస్తే.. ద్రాక్ష , జామ,  బీన్స్‌‌‌‌ ఇతర కాయగూరల్లో  ఫైబర్, విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి  చెడు కొలెస్ట్రాల్ తయారీని అడ్డుకుంటాయి. అలా
కొలెస్ట్రాల్‌‌‌‌ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.

మరింత ప్రమాదం…

కేవలం కొలెస్ట్రాల్ మాత్రమే కాకుండా ఆవు, ఎద్దు, గాడిద, గుర్రం, గొర్రె లాంటి జంతువుల మాంసాలలో కార్నిటైన్ అనే పదార్థం కూడా ఉంటుంది. అది గుండెకు సరఫరా అయ్యే రక్తనాళాలను మూసుకుపోయేలా చేస్తుంది. దానివల్ల గుండె దెబ్బతింటుందని అనేక పరిశోధనలు చెప్తున్నాయి. మాంసం ద్వారా పేగుల్లోకి చేరిన కార్నిటైన్ అక్కడ ఉండే బాక్టీరియా ప్రభావంవల్ల ‘ట్రై మిథలమైన్ ఎన్‌‌ఆక్సయిడ్’(టిఎమ్‌‌ఎఓ)గా మారుతుంది. మాంసం, గుడ్లు, పాల పదార్థాలలో ఈ కార్నిటైన్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. అది ఎక్కువయ్యే కొద్దీ గుండె జబ్బు ప్రమాదం మరింత పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. యూరోపియన్ హార్ట్ జర్నల్‌‌లో కూడా ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి.

ఎల్‌‌డీఎల్‌‌తో ప్రమాదం…

ఈ రీసెర్చ్ కోసం ఆరోగ్యంగా ఉన్న  వంద మంది ఆడవాళ్లను, వంద మంది మగవాళ్లను ఎంచుకున్నారు. వీళ్లందరినీ మూడు గ్రూప్స్‌‌గా డివైడ్ చేశారు. కొందరికి రెడ్ మీట్ డైట్, మరికొందరికి వైట్ మీట్ డైట్, మిగిలిన వాళ్లకి వెజ్ డైట్ ఇచ్చారు. ప్రతీ ఒక్కరూ ఒక్కో డైట్ నాలుగు వారాలు పాటు తినాలి. ఆ నాలుగు వారాల తర్వాత  వాషవుట్ పీరియడ్ ఉంటుంది. ఈ పీరియడ్‌‌లో ఎవరికి వాళ్లు.. వాళ్ల రెగ్యులర్ ఫుడ్ తీసుకోవాలి. ఈ ప్రయోగానికి ముందు, వెనుక అందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. ఆ బ్లడ్ శాంపిల్స్‌‌ను టెస్ట్ చేసిన తర్వాత  తేలిందేంటంటే.. ఏ రకం మాంసం అయినా కొలెస్ట్రాల్ ముప్పు ఉండి తీరుతుంది. కేవలం మాంసం మాత్రమే కాకుండా.. జంతువుల నుంచి వచ్చే.. వెన్న, జంతువుల కొవ్వు, పౌల్ట్రీ స్కిన్,  ఇవి కూడా ‘లో డెన్సిటీ లైపో ప్రొటీన్స్ (ఎల్‌‌డీఎల్)’ని ఉత్పత్తి చేస్తాయి. ఇది రక్తంలో కలిసి చెడు కొలెస్ట్రాల్‌‌గా మారే అవకాశం ఉంటుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులకు దారితీయొచ్చు.