
పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత బిలియనీర్ హర్ష్ గోయెంకా పాకిస్తాన్‌కు మద్దతిస్తున్న టర్కీ,అజర్‌బైజాన్‌లకు ప్రయాణాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఇండియన్ టూరిస్టుల ద్వారా టర్కీకి భారీ ఆదాయం వస్తుంది.. తద్వారా వారి ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని హైలైట్ చేశారు. ఇక్సిగో, ఈజీ మైట్రిప్ సహా అనేక భారతీయ ట్రావెల్ కంపెనీలు భారత్ కు మద్దతుగా బుకింగ్ లను నిలిపివేశాయన్నారు.
పహల్గాం దాడి తర్వాత భారత్ పై దాడి చేసేందుకు పాకిస్తాన్ కు సాయమందించిన టర్కీ, అజర్ బైజాన్ లకు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని బిలియనీర్ హార్ష్ గోయెంకా భారత పౌరులను కోరారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాం X ద్వారా ఓ పోస్ట్ ను షేర్ చేశారు.
2024లో రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఇండియన్ టూరిస్టులు దాదాపు 4వేల కోట్లకు పై అందించారని చెప్పారు. మన శత్రువులకు మద్దతిచ్చే ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలకు సపోర్టు చేయకుండా భారత్ ప్రయాణికులు తమ శక్తిని ప్రదర్శించాల్సిన సమయం వచ్చిందని గోయెంకా అన్నారు.
గతేడాది పర్యాటకం ద్వారా టర్కీ, అజర్ బైజాన్ కు 4వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. దీంతోపాటు అక్కడి ప్రజలకు ఉద్యోగాలు, హోటళ్లు, విమానాలు వంటివి గణనీయంగా పెంచుకున్నారు. ఇప్పుడు పహల్గాం దాడి తర్వాత రెండు దేశాలు పాకిస్తాన్ తో నిలబడ్డారని విమర్శించారు. భారత్ తోపాటు ప్రపంచంలో అనేక అందమైన ప్రదేశాలున్నాయి. దయచేసి ఈ రెండు ప్రదేశాలకు వెళ్లొద్దంటూ గోయెంకా X లో పోస్ట్ చేశారు.
భారత్,పాక్ మధ్య ఉద్రిక్తతల క్రమంలో టర్కీ, పాకిస్తాన్ కు సాయం చేసిందని ఇప్పటివరకు అనుమానాలు మాత్రమే ఉండేది.. ఇప్పుడు సాక్ష్యాలుగా కూడా దొరికాయి. ఆపరేషన్ సిందూర్ లో ఇద్దరు టర్కిష్ సైనికులు చనిపోయారు. భారత్ పై దాడికి పాకిస్తాన్ కు 350 కి పైగా డ్రోన్లను అందించిందని, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ పై డ్రోన్ దాడులు చేసేందుకు పాకిస్తాన్ ఆర్మీ అధికారులకు టర్కీ సలహాదారులు సహాయం చేశారని నిఘా వర్గాలు చెబుతున్నాయి.
భారత్ పై బేరక్తర్ TB2, YIHA డ్రోన్లు పాకిస్తాన్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. భారత సైనిక స్థావరాలను, కాన్వాయ్ లను బెదిరించేందుకు, కామికేజ్ దాడులకు ఈ డ్రోన్లను వినియోగించినట్లు సమాచారం.
పాకిస్తాన్ తో టర్కీ గత కొన్నేళ్లుగా వ్యూహాత్మక రక్షణ సంబంధాలను కొనసాగిస్తోంది. ఇటీవలి కాలంలో అవి బాగా బలపడ్డాయి. టర్కీ ప్రభుత్వం కీలకమైన సైనిక హార్డ్‌వేర్‌ను సరఫరా చేయడమే కాకుండా పాకిస్తాన్ సైన్యానికి శిక్షణ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే పాకిస్తాన్ భారత్ పై డ్రోన్ దాడికి టర్కీ సహకరించిందని ఆందోళనలు చెలరేగాయి. దేశవ్యాప్తంగా టర్కీని బహిష్కరించాలి అని ఉద్యమం సాగింది. టర్కీ చర్యలు భారత ప్రయోజనాలను దెబ్బతీస్తుందని వాదనలు వినిపించాయి.