రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తాం: కేంద్రమంత్రి హర్ సిమ్రత్ కౌర్

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తాం: కేంద్రమంత్రి హర్ సిమ్రత్ కౌర్

వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం, రైతును ఆర్థిక ఎదిగేందుకు సహాయపడటమే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ముఖ్య ఉద్దేశమని  కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం లక్కంపల్లిలో రు.108 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్కు ను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత ప్రాధాన్యత నిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చినట్లయితే కేంద్ర పూర్తి సహకారం అందిస్తుందన్నారు. వీటితో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా రైతులు పంటలకు మద్దతు ధర పొందుతారన్నారు.

రు. 5 కోట్ల మేర సబ్సిడీ

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో చిన్న యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి గల రైతులు, స్వయం సహాయక సంఘాలకు కేంద్రం సహకారం అందిస్తుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు  కేంద్ర ప్రభుత్వం ద్వారా  5 కోట్ల వరకు సబ్సిడీ కూడా అందిస్తుందని ఆమె తెలిపారు. లక్కంపల్లి  ఆగ్రో యూనిట్‌‌ రాష్ట్రంలో అతిపెద్దదని తెలిపారు. అలాగే రాష్ట్రానికి రెండో యూనిట్ కూడా మంజూరు చేశామన్నారు. లక్కంపల్లి మెగా యూనిట్ ద్వారా   నిజామాబాద్, కామారెడ్డి,  జగిత్యాల,  కరీంనగర్,  నిర్మల్ జిల్లాలకు చెందిన సుమారు 25 వేల మంది రైతులకే కాకుండా ఐదు వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉందన్నారు. పదెకరాల భూమి ఉన్నా కూడా మినీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పేందుకు సహకరిస్తామని మంత్రి చెప్పారు.

మంత్రి మాట్లాడుతుండగా టీఆర్​ఎస్​, బీజేపీ కార్యకర్తలు ఎవరి పార్టీకి అనుకూలంగా వారు నినాదాలు చేయడంతో మంత్రి కొంత అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ధోరని సరికాదన్నారు. అనంతరం కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ మాట్లాడుతూ..   నిజామాబాద్ జిల్లా పసుపు రైతులకు ఈ మెగా యూనిట్‌‌ ద్వారా కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందన్నారు. మొక్కజొన్న, సోయాబీన్ పంటలు పండించే రైతులు కూడా ఎక్కువ ప్రయోజనాలు పొందుతారని చెప్పారు. నిజామాబాద్ ఎంపీ  ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే జీవన్రెడ్డి, తాను సమన్వయంతో  అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రైతులకు మేలు జరిగే విధంగా ప్రయత్నిస్తామని చెప్పారు.