చండీగఢ్: హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ లాడ్వా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట ఆయన భార్య సుమన్ సైనీ, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కురుక్షేత్ర ఎంపీ నవీన్ జిందాల్ ఉన్నారు. అక్టోబరు 5న హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు సైనీ.. లాడ్వా అసెంబ్లీ సెగ్మెంట్లో రోడ్‌షో నిర్వహించారు. అక్కడ బీజేపీ మద్దతుదారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పార్టీ నేతలతో కలిసి సైనీ రోడ్‌షోలో ట్రాక్టర్‌ను నడిపారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మీడియాతో మాట్లాడుతూ.. హర్యానాలో బీజేపీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. సీఎం సైనీ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి దిశగా పయనిస్తోందని అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి కొత్త దిశానిర్దేశం చేసిందన్నారు. అవినీతిని, బంధుప్రీతిని అరికట్టి, రైతులు, మహిళలు, పేదలకు సాధికారత కల్పించిందని పేర్కొన్నారు.
21 మందితో బీజేపీ రెండో లిస్ట్ రిలీజ్
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మరో 21 మంది అభ్యర్థులతో రెండో జాబితాను మంగళవారం విడుదల చేసింది. జులానా అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్ ఫొగాట్‌పై బీజేపీ కెప్టెన్ యోగేశ్ బైరాగిని బరిలోకి దించింది.