హర్యానాలో హోటల్ కూల్చివేత

హర్యానాలో హోటల్ కూల్చివేత
  • డాబా పై నుంచే రాళ్ల దాడి జరిగిందన్న అధికారులు
  • తన హోటల్​కు అల్లర్లతో సంబంధం లేదంటున్న ఓనర్ 

నూహ్(హర్యానా): అల్లర్లకు కారణమైన వారిపై హర్యానా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. వరుసగా నాలుగో రోజు ఆదివారం కూడా అధికారులు బుల్డోజర్లకు పనిచెప్పారు. నూహ్​లోని రజా సహారా హోటల్‌‌ను కూల్చేశారు. రాళ్ల దాడికి దుండగులు సహారా హోటల్​ను వాడుకున్నట్లు నిర్ధారించిన అధికారులు.. ఈ చర్యలు చేపట్టారు. హోటల్ డాబాపై నుంచి యాత్రలో ఉన్నవారిపై రాళ్లు రువ్వారని, దీంతోనే హింస చెలరేగిందని అధికారులు తెలిపారు. ఒక్కసారిగా రాళ్ల దాడి జరగడంతో 2,500 మంది తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఆలయంలోకి వెళ్లారని వివరించారు. మరోవైపు ఈ హోటల్‌‌ యజమాని జంషెద్‌‌ మాత్రం అల్లర్లతో తన హోటల్‌‌కు సంబంధంలేదన్నాడు. 

అల్లరి మూకలు వాడినట్లు చెబుతున్న హోటల్‌‌ మరో ప్రాంతంలో ఉందని అంటున్నాడు. కూల్చివేసిన కొన్ని దుకాణాలు, ఇండ్లు ఇటీవల జరిగిన హింసలో పాల్గొన్న వారివేనని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి దాకా 50 నుంచి 60 నిర్మాణాలు కూల్చేశామని తెలిపారు. అరెస్టులకు భయపడి చాలా మంది పారిపోయారన్నారు. 

ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని, అందుకే వాటిని గుర్తించి నోటీసులు ఇచ్చాకే కూల్చేస్తున్నామని తెలిపారు. చాలా ఏండ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నదన్నారు. మరో 60 అక్రమ నిర్మాణాలను పడగొడ్తామని, వారందరికీ నోటీసులు ఇచ్చామని మున్సిపల్ అధికారులు ప్రకటించారు. నూహ్‌‌లో ఇంటర్నెట్‌‌ సేవలను 8వ తేదీ దాకా నిలిపివేశారు. కేవలం వాయిస్‌‌ కాల్స్‌‌ మాత్రమే చేయానికి వీలుంది.