హర్యానాలో హైడ్రామా..బీజేపీ, జేజేపీ మధ్య విభేదాలు

 హర్యానాలో హైడ్రామా..బీజేపీ, జేజేపీ మధ్య విభేదాలు
  •      ఉదయం సీఎం మనోహర్ లాల్​ ఖట్టర్ రాజీనామా
  •     కొత్త సీఎంగా సాయంత్రంనాయబ్​ సింగ్​ సైని ప్రమాణం

చండీగఢ్ :  పార్లమెంట్ ఎన్నికల వేళ హర్యానాలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్ర రాజకీయాల్లో హైడ్రామా నెలకొంది. సీఎం మనోహర్ లాల్​ ఖట్టర్ తన మంత్రివర్గంతో సహా రాజీనామా చేయగా.. సాయంత్రానికి కొత్త సీఎంగా నాయబ్ సింగ్​ సైని ప్రమాణం చేశారు. ఖట్టర్ రాజీనామా ఆమోదం నుంచి సైని ప్రమాణ స్వీకారం దాకా వెనువెంటనే జరిగిపోయాయి. రాష్ట్రంలో మిత్ర పక్షం జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) తో విభేదాల వల్లే ఖట్టర్ దిగిపోయారంటూ బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయని సమాచారం. దీంతో ఖట్టర్ రాజీనామా చేశారని, మళ్లీ ఆయనే సీఎంగా ప్రమాణం చేస్తారని పార్టీ నేతలు చెప్పారు. అయితే, అనూహ్యంగా సైనీ పేరు తెరపైకి రావడం, సాయంత్రానికి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఖట్టర్​కు సైని అత్యంత సన్నిహితుడు కావడం విశేషం. పార్టీ అధిష్ఠానం ఖట్టర్​ను లోక్ సభ బరిలో దించనుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

స్వతంత్రుల మద్దతుతో..

హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 సీట్లు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు 46 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఈ క్రమంలో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. జేజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో స్వతంత్రులతో పాటు హర్యానా లోక్ హిత్​ పార్టీ (హెచ్ ఎల్​పీ) ఎమ్మెల్యే మద్దతుతో సైని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. కాగా, హర్యానా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 30 మంది ఎమ్మెల్యేలు, జేజేపీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

అనూహ్యంగా సైనీ పేరు తెరపైకి

ఖట్టర్ రాజీనామాతో సీఎంగా​ ఓబీసీ నేత అయిన సైనీ పేరు అన్యూహంగా  తెరపైకి వచ్చింది.కొత్త సీఎం ఎవరనేదానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పలువురు పేర్లు తెరపైకి రాగా, బీజేపీ అధిష్టానం మాత్రం ఓబీసీ నేత అయిన సైనీ వైపు మొగ్గుచూపింది. ఈయన ఖట్టర్​కు అత్యంత సన్నిహితుడు కావడం ఓ కారణంగా తెలుస్తున్నది. నాయబ్ సింగ్​​ సైనీ 1970 జనవరి 25న అంబాలా జిల్లాలోని మిర్జాపూర్ మజ్రా గ్రామంలో జన్మించారు. 54 ఏండ్ల సైనీ బీజేపీలో 1996లో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ పలు పదవులు చేపట్టారు. 2014లో అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఖట్టర్​ క్యాబినెట్​లో మంత్రిగా పని చేశారు. 2019 లోక్​సభ ఎన్నికల్లో కురుక్షేత్ర నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల్ ​సింగ్​పై భారీ మెజార్టీతో ఎంపీగా గెలుపొందారు. నిరుడు అక్టోబర్​లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యా రు. కురుక్షేత్ర, హిస్సార్​, అంబాలా, రేవాడీ జిల్లాల్లో సైనీల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో లోక్​సభ ఎన్నికల వేళ బీజేపీ అధిష్టానం సైనీకి పగ్గాలు అప్పజెప్పినట్టు తెలుస్తోంది.