రోడ్ల కోసం రూ.8 వేల కోట్ల కన్నా ఎక్కువే తీసుకొచ్చా : ఎంపీ బండి సంజయ్

రోడ్ల కోసం రూ.8 వేల కోట్ల కన్నా ఎక్కువే తీసుకొచ్చా : ఎంపీ బండి సంజయ్
  • కరీంనగర్  కొత్త  ఓటర్లతో  ఎంపీ బండి సంజయ్

కరీంనగర్, వెలుగు :  ప్రధాని నరేంద్ర మోదీ లేని భారత్ ను ఊహించుకోలేమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్  అన్నారు. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీ ఉండాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్   జిల్లా తిమ్మాపూర్ లోని చైతన్య ఇంజనీరింగ్  కాలేజీలో బీజేవైఎం ఆధ్వర్యంలో జరిగిన  నవ యువ ఓటర్ల సమ్మేళనంలో బండి మాట్లాడారు.  మోదీ లేకపోతే దేశ చరిత్రను మార్చే పనులన్నీ ఆగిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మన రాజ్యాంగం సామాన్యుడికి ఇచ్చిన వజ్రాయుధం ఓటు హక్కు అని,  అంతటి విలువైన ఆయుధాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

చదువుకున్నోళ్ల కన్నా చదువురానోళ్లే  ఓటు హక్కును ఎక్కువగా వాడుకుంటున్నారని చెప్పారు. ఎన్నికల్లో పోటీచేసే అవినీతిపరులను, వారసత్వ రాజకీయాలు, స్వార్థ రాజకీయాలు నడిపే నాయకులను ఓటుతో ఊచకోత కోయాలని పిలుపునిచ్చారు.  ఎంపీగా తాను వేల కోట్లు తీసుకొచ్చానని, కేవలం రోడ్ల కోసమే రూ.8 వేల కోట్లుపైనే తీసుకొచ్చానని పేర్కొన్నారు. అయినా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, దీనిని యువత తిప్పికొట్టాలని కోరారు.  నిధులు తెచ్చేందుకు ప్రతిపాదనలు పంపాలని కోరినా పట్టించుకోని మూర్ఖులు బీఆర్ఎస్ సర్కార్ లో ఉన్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్  పాలనలో పుట్టబోయే బిడ్డపైనా రూ.1.6 లక్షల అప్పు భారం పడిందని ఆయన విమర్శించారు.