
సౌతాఫ్రికా వెటరన్ బ్యాట్స్‌మన్ హషీమ్ ఆమ్లా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గురువారం వీడ్కోలు పలికాడు. అన్న ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన ఆమ్లా సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్(టీ20ల్లో కూడా)లో కొనసాగుతానని ప్రకటించాడు. ఇంగ్లండ్ వేదికగా ఇటీవల ముగిసిన వరల్డ్‌కప్ సౌతాఫ్రికా దారుణ వైఫల్యం తర్వాత ఆమ్లా ఆటకు వీడ్కోలు పలకడం ప్రాధాన్యత సంతరించుకుంది. 36 ఏళ్ల ఆమ్లా 15 ఏళ్ల ఇంటర్నేషనల్ కెరీర్‌లో అన్ని ఫార్మాట్‌ల్లో కలిపి349 మ్యాచ్‌లాడి 18000 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 55 సెంచరీలు, 88 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఒకప్పుడు నంబర్‌వన్
2004 నవంబర్‌లో ఈడెన్‌గార్డెన్స్‌లో ఇండియా తో జరిగిన టెస్ట్‌తో ఇంటర్నేషనల్ కెరీర్‌ను మొదలుపెట్టిన ఆమ్లా ప్రారంభంలో విమర్శలు ఎదుర్కొన్నాడు. బ్యాటింగ్ టెక్నిక్‌లో సమస్యల వల్ల ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న ఆమ్లా..2016లో న్యూజిలాండ్‌పై తొలి టెస్ట్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఓ దశలో టెస్టులు, వన్డేల్లో వరల్డ్‌నంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్నాడు. 2014లో టెస్ట్ జట్టు పగ్గాలు కూడా అందుకున్న హషీమ్ 2016లో కెప్టెన్సీ వదులుకున్నాడు.
కలిస్ తర్వాతి స్థానంలో
కెరీర్‌లో 124 టెస్టులు ఆడిన ఆమ్లా 28 సెంచరీలు, 41 హాఫ్ సెంచరీలతో కలిపి మొత్తం 9282 పరుగులు చేశాడు. సాతాఫ్రికా తరఫున టెస్టులో అత్యధిక రన్స్ చేసిన రెండో ఆటగాడి నిలిచాడు. ఆమ్లా కంటే ముందు జాక్వస్ కలిస్(13,289) ఉన్నాడు. అంతేకాక టెస్ట్‌ల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక సౌతాఫ్రికా ఆటగాడి కూడా రికార్డు సృష్టించాడు. 2012లో ఓవల్‌లో ఇంగ్లండ్‌పై 311 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
వన్టేల్లోనూ రాజే..
181 వన్డేలాడిన హషీమ్ 27 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలతో మొత్తం 8113 పరుగులు చేశాడు. 44 టీ20ల్లో 1277 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 2000, 3000, 4000, 5000, 6000, 7000 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఎనిమిది వేల రన్స్ రికార్డును ఒక్క ఇన్నింగ్స్‌తో కోహ్లీకి కోల్పోయాడు. 8000 రన్స్‌కు కోహ్లీ 175 ఇన్నింగ్స్ తీసుకుంటే ఆమ్లా 176 ఇన్నింగ్స్ ఆడాడు. చివరిగా ఇంగ్లండ్ వేదికగా ఇటీవల ముగిసిన వరల్డ్‌కప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగి 80 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాగా, ప్రొటిస్ పేసర్ డేల్ స్టెయిన్ మంగళవారం రిటైర్మెంట్ ప్రకటించాడు.
ప్రొటిస్ జట్టుతో ఇన్నేళ్ల ప్రయాణానికి అవకాశమిచ్చిన భగవంతునికి ధన్యవాదాలు. ఈ ప్రయాణంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నా. ఎందరో స్నేహితులను పొందా. అన్నింటికంటే మించి సోదర భావాన్ని ఆస్వాదించా. నా తల్లిదండ్రుల ప్రేమ, వారు చేసిన ప్రార్థనల వల్లే సౌతాఫ్రికా జట్టుతో ఈ ప్రయాణం సాధ్యమైంది. అన్నివేళలా అండగా నిలిచిన అభిమానులకు, ప్రొత్సహించిన సౌతాఫ్రికా బోర్డుకు రుణపడి ఉంటా’ – హషీమ్ ఆమ్లా