జిల్లాలో ఈ నెల 12 నుంచి రేవంత్​రెడ్డి పాదయాత్ర

జిల్లాలో ఈ నెల 12 నుంచి రేవంత్​రెడ్డి పాదయాత్ర
  •     ఏడాదిన్నరగా ఎవరికి వారే.. తీరుగా జిల్లా కాంగ్రెస్​ నేతలు 
  •     సీడబ్ల్యూసీ​ పదవి కోసం నువ్వా నేనా అనేలా ప్రయత్నాలు  
  •     యాత్ర  ఏర్పాట్లలోనూ  కనిపించని ఐక్యత..
  •      యాత్ర సక్సెస్​పై  క్యాడర్​లో ఆందోళన                                                ​

 నిజామాబాద్,  వెలుగు: ‘హాత్​ సే హాత్​ జోడో యాత్ర’ కు జిల్లా కాంగ్రెస్​లో వర్గపోరు బుగులు పట్టుకుంది. జిల్లాలో ఈ నెల 12 నుంచి ఆరు రోజుల పాటు టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి పాదయాత్ర సాగనుండడంతో మూడు వర్గాలుగా ఏర్పడిన కాంగ్రెస్​ సీనియర్ల ఐక్యతపై క్యాడర్​లో ఆందోళన నెలకొంది. గత నెల పార్టీ సీడబ్ల్యూసీ మెంబర్ ​పదవి కోసం జిల్లా లీడర్లు నువ్వా  నేనా అన్నట్లు  ప్రయత్నాలు చేశారు. అంతకు ముందు డీసీసీ కొత్త కమిటీ   నియామకం సందర్భంగా లీడర్లు బహిరంగంగానే విమర్శించుకున్నారు.  ఈ నేపథ్యంలో  రేవంత్​ పాదయాత్రలో కలిసి నడుస్తారా? ఎవరికి వారే అన్నట్లుగా సాగుతారా? అన్న చర్చ జరుగుతోంది.  

సీడబ్ల్యూసీ పదవి కోసం..

టీపీసీసీ ప్రెసిడెంట్ పదవి తనకు ఇవ్వకుండా అన్యాయం చేశారని సీడబ్ల్యూసీ ఇవ్వాలని సీనియర్​ నేత మధు యాష్కీ  హైకమాండ్​ను కోరుతున్నారు. జాతీయ నేత రాహుల్ గాంధీకి ​సన్నిహితంగా ఉండే యాష్కీ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రేవంత్​ టీమ్​ గా చెప్పే మాజీ మంత్రి సుదర్శన్​రెడ్డి కూడా ప్రయత్నిస్తుండగా, మైనారిటీ కోటాలో సీనియర్​ నేత షబ్బీర్​ అలీ పేరు కూడా తెరపైకి వచ్చింది. దీంతో పదవి నీకా..? నాకా..? అన్నట్లు ముగ్గురు నేతల మధ్య వర్గపోరు మొదలైంది. కానీ జిల్లాలో నేతల మధ్య వర్గపోరు లేదని ఐక్యతతో ముందుకు వెళుతున్నామని డీసీసీ ప్రెసిడెంట్​మానాల మోహన్​రెడ్డి  చెప్తున్నారు. 

డీసీసీ, పీసీసీ నియామకాల్లోనూ..

ఐదు నెలల కింద  నియమించిన డీసీసీ ప్రెసిడెంట్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీల పోస్టులు మాజీ మంత్రి వర్గానికే దక్కాయి. టీపీసీసీ వర్కింగ్ ​ప్రెసిడెంట్​మహేశ్​గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్​మధుయాష్కీ  ప్రతిపాదించిన బాడ్సి శేఖర్​గౌడ్ కు డీసీసీ రాలేదు. సుదర్శన్ రెడ్డి శేఖర్​గౌడ్​కు పదవి రాకుండా అడ్డుకుని తన అనుచరుడు  మోహన్​ రెడ్డి కి పదవి ఇప్పించుకున్నారని మధుయాష్కీ వర్గీయులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​పార్టీ  స్ట్రాటజిస్ట్ ​సునీల్ ​డీసీసీల ఎంపికపై  ఇచ్చిన రిపోర్ట్​ కు విరుద్ధంగా ప్రెసిడెంట్లను నియమించారని యాష్కీ చేసిన కామెంట్స్​అప్పట్లో జిల్లాలో దుమారం రేపాయి.  

సిట్టింగ్​ప్రెసిడెంట్​మానాల మోహన్​రెడ్డి పనితీరు బాగాలేదని  రిపోర్ట్ ఇచ్చినా అతనికే మళ్లీ ఇవ్వడమేమిటని మండిపడ్డారు. ఈ కామెంట్స్​తో జిల్లా కాంగ్రెస్​లో మాజీ మంత్రి సుదర్శన్​ టీమ్​ను యాష్కీ టార్గెట్ చేసినట్లు కనిపించింది. మొట్ట మొదటి కార్యవర్గ మీటింగ్ కు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి హాజరు కాగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్​మధుయాష్కీ లతో పాటు అనుచరులు కూడా గైర్హాజరయ్యారు. ఈ మీటింగ్​లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే లీడర్లపై హైకమాండ్​క్రమశిక్షణా చర్యలు తప్పవని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి చేసిన కామెంట్స్ జిల్లాలో వర్గపోరుకు ఆజ్యం పోశాయి. టీపీసీసీ పదవులు, డీసీసీ ప్రెసిడెంట్​పోస్టుల్లో రెడ్డి వర్గీయులకే పెద్దపీట వేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అన్యాయం చేశారని యాస్కీ వర్గం నేతలు ఆరోపించారు.

 రెడ్డి వర్సెస్ ​బీసీ అనేలా..

జిల్లాలో సీనియర్​ లీడర్లు అయిన డీసీసీ మాజీ ప్రెసిడెంట్​తాహెర్​ బిన్​ హందాన్​,  పీసీసీ వైస్​ ప్రెసిడెంట్ గంగాధర్,  మాజీ సెక్రటరీ నగేశ్​రెడ్డిలకు టీపీసీసీలో జనరల్​ సెక్రటరీ పదవులు దక్కాయి. డీసీసీ పోస్టులో సిట్టింగ్​ ప్రెసిడెంట్​ మోహన్​ రెడ్డి 2వ సారి నియమితులయ్యారు. బీసీల ప్రాబల్యం ఉన్న జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. రూరల్​ అసెంబ్లీలో కీలక నేత శేఖర్​ గౌడ్​ కు పదవి రాకుండా మంత్రి  అడ్డుపడినట్లు ఆరోపణలు వచ్చాయి.   

నాలుగేండ్ల కింద మొదలై..

 సుదర్శన్​రెడ్డి,  మధు యాష్కీల మధ్య  నాలుగేండ్ల కింద విభేదాలు మొదలయ్యాయి. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల ఇన్​చార్జిగా సుదర్శన్​రెడ్డి నియామకమయ్యారు. కానీ ఎంపీ అభ్యర్థిగా మధు యాష్కీ నామినేషన్​ వేసిన వెంటనే ఇన్​చార్జి పదవి నుంచి సుదర్శన్ రెడ్డి తప్పుకున్నారు. సీనియర్​నేత తప్పుకోవడంతో పార్టీ కార్యకర్తలు డీలాపడ్డారు. ఆ ఎన్నికల్లో మధుయాష్కీ ఓడిపోయారు. దీంతో మధు యాష్కీ , సుదర్శన్ ​రెడ్డి  మధ్య వార్​మొదలైంది. ఏడాది కింద టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్​గా మధుయాష్కీ నియమితులయ్యారు. పదవి వచ్చిన సందర్భంగా జిల్లాలో స్వాగత సభకు, బోధన్​లో నిర్వహించిన కాంగ్రెస్​సభకు సుదర్శన్​రెడ్డి హాజరు కాలేదు.

బోధన్​ముఖ్య నేతలతో హైకమాండ్​హైదరాబాద్​లో  మీటింగ్ నిర్వహించగా, మధుయాష్కీ హాజరు కాలేదు. దీంతో పీసీసీ ప్రెసిడెంట్​రేవంత్​రెడ్డి జోక్యం చేసుకుని మాట్లాడడంతో విబేధాలకు తెర పడినట్లయింది. మళ్లీ నిజామాబాద్​లో  పార్టీ మెంబర్​షిప్​రివ్యూ మీటింగ్​లో  మధు యాష్కీపై  క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని  మాజీ ఎమ్మెల్యే అనిల్ తీర్మానం ప్రవేశపెట్టారు. మంత్రి సుదర్శన్​ రెడ్డికి సన్నిహితుడిగా ఉన్న అనిల్​తీర్మానం పెట్టడంతో మళ్లీ  వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి.  ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్​రెడ్డి పాదయాత్రకు సీనియర్​లీడర్లు చేయి చేయి కలిపి నడుస్తారా?  లేదా క్యాడర్​లో ఆందోళన రేపుతోంది.