నిజామాబాద్, వెలుగు: మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ మొదటిసారి తన సోదరుడు ఎంపీ అర్వింద్ కు సవాల్ విసిరాడు. ఎంపీగా అర్వింద్ చేసిందేమీలేనందునే అవతలివారిపై పడ్తున్నడని విమర్శించారు. ఆదివారం స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంజయ్ తన తమ్ముడు ఎంపీ అర్వింద్‌పై ఘాటు విమర్శలు చేశారు. ‘‘డి.శ్రీనివాస్‌కు ఇద్దరు కొడుకులున్నరు. ఇద్దరి ఆస్తులు బయటపెడ్దాం. అప్పుడు ఎవరు దోచుకున్నరో ఓపెన్ అవుతది’ అని సవాల్ విసిరారు. బీజేపీ గెలిస్తే నిజామాబాద్ కార్పొరేషన్ పేరును ఇందూర్‌గా మారుస్తామంటూ చేపట్టిన ప్రచారాన్ని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ మున్సిపాలిటీలో ఇద్దరు బీజేపీ చైర్పర్సన్లు పనిచేశారని అప్పుడెందుకు ఇందూర్ పేరు యాదికి రాలేదని ప్రశ్నించారు.
పేర్లు మార్చడానికి ఎంపీ, ఎమ్మెల్యేలెందుకు పెయింటర్ చాలుకదా అని అన్నారు. నాగారం ఏరియాలో దొంగపట్టాలతో పేదలకిచ్చిన ఇండ్ల స్థలాలు ఆక్రమించిన వారి సంగతి తేలుస్తానన్న ఎంపీ అర్వింద్ హామీ యాడబోయిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో ముందుకెళ్తున్న కాంగ్రెస్‌కు అండగా ఉండాలని కోరారు. అధిక స్థానాల్లో గెలిచేలా సపోర్టు చేసి నగరపాలక సంస్థలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలన్నారు. బీజేపీ కార్పొరేటర్లు గెలిస్తే గల్లీ పనుల కోసం ఢిల్లీ చక్కర్లు కొట్టే పరిస్థితులు వస్తాయన్నారు.
