దేశానికి ఆడాలన్న తపనే కోహ్లీని నడిపిస్తోంది

దేశానికి ఆడాలన్న తపనే కోహ్లీని నడిపిస్తోంది

ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును అందుకున్నాడు. వన్డేల్లో వేగంగా 12 వేల మైలురాయిని చేరుకొని ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డను తిరగరాశాడు. ఈ రికార్డు గురించి వెటరన్ ఓపెనర్ గౌతం గంభీర్ స్పందించాడు. విరాట్ బ్యాటింగ్‌‌పై ప్రశంసల వర్షం కురిపించిన గంభీర్.. దేశం కోసం ఆడుతున్నప్పుడు దక్కే సంతృప్తే కోహ్లీ ఇంతలా విజృంభించి ఆడటానికి కారణమన్నాడు.

‘ఏ ప్లేయర్‌‌కైనా దేశం కోసం ఆడటాన్ని మించిన ఆనందం మరొకటి ఉండదు. మన జట్టు తరఫున పరుగులు సాధించి హోటల్ రూమ్‌‌కు చేరుకున్నప్పుడు కలిగే సంతోషమే వేరు. ఆ టైమ్‌‌లో చాలా సంతృప్తికరంగా అనిపిస్తుంది. ఇలాంటి అనుభూతే కోహ్లీని అత్యుత్తమ ప్లేయర్‌‌గా మార్చింది. అతడికి హ్యాట్సాఫ్. ఆ అనుభూతి, ఆ స్ఫూర్తే కోహ్లీతో 20 వేలకు పైగా రన్స్, పదుల సంఖ్యలో శతకాలు బాదేలా చేసింది’ అని గంభీర్ పేర్కొన్నాడు.