
న్యూఢిల్లీ: రష్యా నుంచి ఇకపై భారత్ ఆయిల్ కొనుగోలు చేయకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. చమురు కొనుగోలు విషయంలో దేశ ప్రజయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని.. ఎవరి ఒత్తిడికి తలొగ్గేది లేదని స్పష్టం చేశాయి. ట్రంప్ చెప్పినట్లుగా.. భారత చమురు సంస్థలు రష్యా నుంచి దిగుమతులను నిలిపివేయలేదని క్లారిటీ ఇచ్చాయి. భారత ఆయిల్ కంపెనీలు రష్యా నుంచి ఇంధనం దిగుమతి చేసుకుంటున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
కాగా.. ఉక్రెయిన్-రష్యా మూడేళ్లుగా యుద్ధం చేస్తో్న్న విషయం తెలిసిందే. యుద్ధం ఆపాలని రష్యాపై పలుమార్లు ఒత్తిడి తెచ్చారు ట్రంప్. కానీ ట్రంప్ మాటలను ఖాతరు చేయని రష్యా.. ఉక్రెయిన్‌తో యుద్ధం కంటిన్యూ చేస్తోంది. దీంతో రష్యాను ఆర్థికపరంగా దెబ్బకొట్టాలని ప్లాన్ చేసిన ట్రంప్.. ఆ దేశంతో వాణిజ్యం చేయొద్దని హెచ్చరిస్తున్నాడు. రష్యాతో ఉన్న వ్యాపార సంబంధాలను తెంచుకోవాలని.. లేదంటే భారీ సుంకాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని మాస్కోతో బిజినెస్ చేస్తోన్న దేశాలకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు.
రష్యా నుంచి ఆయుధాలు, చమురు కొనుగోలు చేస్తోన్న ప్రధాన దేశాల్లో భారత్ ఒకటి. కానీ అమెరికా ఆదేశాలను లైట్ తీసుకున్న ఇండియా.. రష్యా నుంచి వెపన్స్, ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. ఈ చర్యలతో ఆగ్రహానికి గురైన ట్రంప్.. భారత దిగుమతులపై 25 శాతం ట్రేడ్ టారిఫ్స్ విధించాడు. రష్యాతో బిజినెసే కాకుండా బ్రిక్స్ కూటమిలో భాగస్వామ్యం కావడంతో భారత్‌పై టారిఫ్స్‌తో పాటు అదనంగా పెనాల్టీ కూడా విధించాడు.
రోజురోజుకు అమెరికా నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో ఎందుకు లేని తలనొప్పి అని భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపేసినట్లు గురువారం (జూలై 31) కొన్ని నివేదికలు వెలువడ్డాయి. ఈ నివేదికలపై ట్రంప్ స్పందించారు. భారతదేశంలోని ప్రభుత్వ శుద్ధి కర్మాగారాలు రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేసినట్లు కొన్ని నివేదికలు వచ్చాయని.. దీనిని స్వాగతిస్తున్నామన్నారు. వాణిజ్య ఒప్పందంపై చర్చల వేళ ఇది ఒక మంచి అడుగు అని అభివర్ణించారు.
అయితే.. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు నిలిపివేసినట్లు వచ్చిన నివేదికలు నిజమో కాదో తనకు కచ్చితంగా తెలియదని.. ఏమి జరుగుతుందో చూద్దామని అన్నారు. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో రష్యాతో చమురు కొనుగోళ్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. ట్రంప్ చెప్పినట్లుగా ఏం లేదని.. దేశ ప్రయోజనాల దృష్ట్యా రష్యా నుంచి భారత్ ఇంధనం దిగుమతి చేసుకుంటోందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.